పాదయాత్ర సాగిస్తున్న చినబాబుకు జగన్ సర్కారు మీద బురద చల్లడం తప్ప వేరే పని లేదు. రాజకీయ అవసరం గనుక.. ఏదో అలా ఆయన యాత్ర సాగిపోతున్నదని అనుకోవచ్చు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో యాత్ర సాగిస్తున్న నారా లోకేష్.. తాజాగా అంగన్వాడీల అంశంపై మాట్లాడుతున్నారు. హామీలు నెరవేర్చమని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? అంటూ నిలదీస్తున్నారు. పోలీసు బలం చూసుకుని జగన్ చెలరేగుతున్నారని ఆరోపిస్తున్నారు.
అయినా అంగన్వాడీల పోరాటం గురించి చినబాబు నారా లోకేష్ అంత నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చంద్రబాబునాయుడు పాలన సాగుతుండగా.. వేతనాల పెంపు గురించి అంగన్వాడీలు ఆందోళనకు దిగితే.. అత్యంత పాశవికంగా వారిని పోలీసులతో కొట్టించిన చరిత్ర తెలుగుదేశం ప్రభుత్వానిది.
అలాంటిది ఇప్పుడు అంగన్వాడీల దీక్షలో రచ్చ కాగానే.. అక్కడికి తమ ప్రభుత్వమేదో ఉద్ధారక ప్రభుత్వం లాగా చినబాబు మాట్లాడుతున్నాడు. అధికారంలోకి రాగానే అంగన్వాడీలను ఆదుకుంటాం అంటూ అస్పష్టమైన మాటలతో సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.
చినబాబు తన యాత్రలో పనిలో పనిగా కమలభజన చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భారతీయ జనతా పార్టీని తమ పొత్తుల బుట్టలో వేసుకోవడానికి.. కమలభజన ఉపయోగపడుతుందని చినబాబు భావిస్తున్నట్టుగా ఉంది. సారథ్యం ఇప్పుడు పెద్దమ్మ చేతికే వచ్చింది గనుక.. ఆమె వద్ద గారాలు పోతే.. పొత్తులు కుదురుతాయని కలగంటున్నట్టుగా కూడా ఉంది.
గిరిజనుడి మీద మూత్రం పోసిన ఘటనలో మధ్యప్రదేశ్ సీఎం వ్యవహరించిన తీరును చినబాబు ఇక్కడ కొనియాడుతున్నారు. అక్కడ ఆ దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి ఆక్రమణల ఇంటిని కూల్చేయడంతోపాటు, అతడి కాళ్లుకడిగిన సీఎం గొప్పవారంటూ.. బిజెపికి ప్రీతికరమైన మాటలు మాట్లాడుతున్నారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై ఉన్న ఎస్సీ డ్రైవరు హత్య ఆరోపణల గురించి ప్రస్తావిస్తున్నారు.
ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. బిజెపి నేతల పనులను కీర్తించడం ద్వారా.. వారితో పొత్తులుకుదర్చుకోవడమే పరమార్థంగా.. లోకేష్ ఈ మాటలు చెబుతున్నారా? అనేది పలువురికి కలుగుతున్న సందేహం.