ఈ మధ్య రచయిత విజయేంద్రప్రసాద్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్, బాలీవుడ్ లో పెద్ద చర్చకు దారితీసింది. ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందంటూ ప్రకటించారు విజయేంద్రప్రసాద్. ఇంతవరకు బాగానే ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన ఆర్ఆర్ఆర్ సినిమాకు సీక్వెల్ వస్తే అందరికీ ఆనందమే. కానీ బాలీవుడ్ జనాలకు మాత్రం కోపంగా ఉంది.
సీక్వెల్ లోనైనా అలియాకు సముచిత స్థానం ఉంటుందా?
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్ హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమె డెబ్యూ మూవీ ఇదే. ఈ సినిమాలో అలియా పాత్రపై చాలా ప్రచారం నడిచింది. కట్ చేస్తే, సినిమాలో ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. సినిమా రిలీజైన టైమ్ లో బాలీవుడ్ లో దీనిపై చాలా పెద్ద చర్చ నడిచింది.
అలియా భట్ పోషించిన పాత్ర వేస్ట్ అంటూ ఉత్తరాది ప్రేక్షకులు పెదవి విరిచారు. ఒక దశలో సినిమాలో తన పాత్రపై అలియాభట్ అసంతృప్తి వ్యక్తం చేసిందనే ఊహాగానాలు కూడా చెలరేగాయి. దానిపై వెంటనే ఆమె స్పందించింది. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా చేయడం గర్వకారణం అంటూ కవర్ చేసుకుంది.
మళ్లీ ఇన్నేళ్లకు విజయేంద్రప్రసాద్ స్టేట్ మెంట్ తో అలియా అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఒకవేళ ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ తీస్తే, కనీసం పార్ట్-2లోనైనా కాస్త నిడివి ఉండేలా, ప్రాధాన్యం పెరిగేలా క్యారెక్టర్ ను ఎంపిక చేసుకోవాలంటూ సోషల్ మీడియాలో అలియాభట్ కు విజ్ఞప్తి చేస్తున్నారు ఆమె అభిమానులు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియాభట్, 2-3 సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఇక నటనా పరంగా చూసుకుంటే.. ఓ బ్రిటిషర్ వచ్చి ఆమెను కడుపులో తంతాడు. ఆ ఒక్క సీన్ మినహాయిస్తే, అలియాకు ఆర్ఆర్ఆర్ లో చెప్పుకోదగ్గ సీన్ లేదు. అలాంటి తక్కువ నిడివి పాత్రను, ప్రాధాన్యం లేని క్యారెక్టర్ ను ఆర్ఆర్ఆర్-2లో చేయొద్దంటూ ఇప్పట్నుంచే ఆమెకు సూచనలు చేస్తున్నారు ఫ్యాన్స్.