తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయం రంజుగా మారింది. శ్రీకాళహస్తి సీటుపై ఎట్టకేలకు చంద్రబాబునాయుడు క్లారిటీ ఇచ్చారు. మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి అభ్యర్థిత్వానికి చంద్రబాబు జై కొట్టారు. దీంతో శ్రీకాళహస్తి టీడీపీ, జనసేనలలో అలజడి చెలరేగింది.
బొజ్జలకు టికెట్ వచ్చిందనే ఆనందంలో ఆయన అనుచరులు జనసేన ఇన్‌చార్జ్ కోటా వినుత ఇంటి వద్ద టపాసులు పేల్చి రచ్చ చేశారు. అలాగే శ్రీకాళహస్తి జనసేన కార్యాలయంలో ఉన్న వీర మహిళలు, కార్యకర్తల్ని బొజ్జల అనుచరులు చితక్కొట్టడంతో గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జనసేనకే టికెట్ ఇవ్వాలంటూ శ్రీకాళహస్తిలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.
తాజాగా టీడీపీలో మరో కుదుపు. బొజ్జలకు టికెట్ ఖరారైన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఆరేడు నెలల క్రితం ఆయన టీడీపీలో చేరి, టికెట్‌పై ఆశ పెంచుకున్నారు. చివరికి నిరాశే మిగిలింది. బొజ్జలకు టికెట్ ఇస్తే… తామెందుకు చేస్తామని ఎస్సీవీ నాయుడు, ఆయన అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శనివారం ఎస్సీవీ నాయుడు నేతృత్వంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. ఎస్సీవీ రాజకీయ అడుగులపై రకరకాల ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతారని అంటున్నారు. సమావేశంలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారో అనే ఉత్కంఠ నెలకుంది.