కేటాయించిన సీట్లకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేయకుండా బీజేపీ ఓవరాక్షన్ చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పైగా బీజేపీలోని కుమ్మలాటలను తమపైకి నెట్టేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలను టీడీపీ, జనసేన కేటాయించింది.
నిజానికి ఏపీలో బీజేపీ అత్యంత బలహీనమైన రాజకీయ పార్టీ. కనీసం నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా ఆ పార్టీకి రాలేదు. అంతేకాదు, ఏపీకి ద్రోహం చేసిన పార్టీగా బీజేపీని రాష్ట్ర ప్రజానీకం గుర్తించారు. అందుకే ఆ పార్టీపై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి పార్టీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయి.
బీజేపీకి సీట్లపై క్లారిటీ ఇచ్చినా, ఆ పార్టీ అభ్యర్థుల ఎంపికపై నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తోంది. తమకు ఓడిపోయే సీట్లన్నీ ఇచ్చారని, అలాగే టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు మాత్రమే టికెట్లు ఇస్తున్నారని, దీని వల్ల నిజమైన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు అన్యాయం జరుగుతుందనే ఆవేదనతో జాతీయ అధ్యక్షుడు నడ్డాకు ఏపీ బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థుల ఎంపికపై పీటముడి పడిందని అంటున్నారు.
తమకు బలమైన స్థానాలను బీజేపీకి ఇస్తుందని ఆ పార్టీ నాయకులు ఎలా అనుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో ఏ సీటు ఇచ్చినా బీజేపీకి ఒకే రకమైన ఫలితాలు వస్తాయనేది టీడీపీ వాదన. అలాంటప్పుడు ఓడిపోయే సీట్లు కాకుండా, గెలిచే సీట్లు తాము నష్టపోవడానికి సిద్ధంగా లేమని అంటున్నారు.
ఎన్నికల షెడ్యూల్ కూడా ఇవాళ వస్తుందని, ఇలాగే కాలాన్ని వృథా చేస్తే మరింత నష్టపోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇచ్చిన సీట్లే ఎక్కువని, మళ్లీ అందులో కూడా బీజేపీ చాయిస్ కోరుకోవడం అత్యాశ అవుతుందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీలోని అంతర్గత గొడవల్ని తమపై నెట్టేయడం మంచిది కాదని వారు అంటున్నారు.