మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకు గురై ఐదేళ్లైంది. ఈ సందర్భంగా వివేకా కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత, భార్య సౌభాగ్యమ్మ కడపలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభను వెనుక నుంచి అన్నీ తానై నడిపిస్తున్న ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. అలాగే మరో ఇద్దరి హాజరు అందర్నీ ఆశ్చర్యపరిచింది.
వివేకా సంస్మరణ సభకు పులివెందుల టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి, మాజీ మంత్రి, బీజేపీ సీనియుర్ నాయకుడు ఆదినారాయణరెడ్డి హాజరై తమదైన రీతిలో డాక్టర్ సునీతను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని పరోక్షంగా ఈ సభా వేదికపై నుంచి వాళ్లిద్దరు పిలుపునిచ్చారు. వివేకాతో తమ అనుబంధాన్ని బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి పంచుకున్నారు.
అయితే సంస్మరణ సభకు మరో గొప్ప వ్యక్తిని అతిథిగా ఆహ్వానించి వుంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అతనెవరో కాదు, వివేకాను ఏ విధంగా గొడ్డలితో నరికి చంపాడో టీవీల ముందుకొచ్చి వినసొంపైన రీతిలో కథ మాదిరిగా చెబుతున్న దోషి. వివేకా కేసులో అప్రూవర్‌గా మారి, ప్రస్తుతం బయట తిరుగుతూ, దర్జాగా సెటిల్మెంట్స్ చేస్తున్న ఆ వ్యక్తిని చీఫ్ గెస్ట్‌గా పిలవడం ఎలా మరిచారబ్బా అనే చర్చకు తెరలేచింది.
వివేకా హత్య కేసులో దోషిని సంస్మరణ సభకు ఆహ్వానించకపోవడంతో, ఆ లోటు స్పష్టంగా కనిపించిందని అభిమానులు అంటున్నారు. అక్కచెల్లెళ్లైన షర్మిల, సునీత ఆ దోషిని పిలవడం ఎలా మరిచారో అర్థం కావడం లేదని జనం దెప్పి పొడుస్తున్నారు.