ఇండస్ట్రీలో ఏ క్రాఫ్ట్ లోనైనా ముందుగా ట్రైనింగ్ అవసరం. ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అవ్వడం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం అనేది సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే ఇలాంటి పద్ధతుల్ని బ్రేక్ చేస్తున్న టెక్నీషియన్స్ వస్తున్నారు.
ఈ పద్ధతిని ఎప్పుడో బ్రేక్ చేశాడు సంగీత దర్శకుడు కేఎం రాధాకృష్ణన్. తనకున్న సంగీత పరిజ్ఞానంతో నేరుగా మ్యూజిక్ డైరక్టర్ అయిపోయాడు. శిష్యరికం చేసే విషయంలో అప్పట్లో పరిస్థితులు అనుకూలించలేదంటున్నాడు.
“కొంతమంది మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర శిష్యరికం చేయడానికి ట్రై చేశాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అప్పట్లో నాకు చాలా కాన్పిడెన్స్ ఉండేది. ఒకరి దగ్గర పనిచేయడం నాకిష్టం లేదు. నిజానికి ఒకరి దగ్గర పనిచేయడానికి ఏం ఉండదు. సరైన సమయం కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైమ్ ఎప్పుడొస్తుందో తెలీదు. ఒకవేళ పనిచేయాలంటే మణిశర్మ, కీరవాణి దగ్గర పనిచేయాలి. అనుకూలమైన వాతావరణం కనిపించలేదు. ఇవన్నీ పక్కనపెడితే.. ఒకడి దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదనిపించింది.”
మణిశర్మ, కీరవాణిలను లెజెండ్స్ గా చెప్పుకొచ్చాడు రాధాకృష్ణన్. కీరవాణికి ఆస్కార్ వచ్చినప్పుడు తను చాలా గర్వంగా ఫీల్ అయ్యానని అన్నాడు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా బయటపెట్టాడు.
“కెరీర్ లో చాలా అవకాశాలు వదులుకున్నాను. కొన్ని మిస్ అయ్యాయి. అర్జున్ రెడ్డి సినిమా అలాంటిదే. ఆ సినిమాకు ముందుగా వర్క్ చేసింది నేనే. సందీప్-నేను కొన్ని రోజులు వర్క్ చేశాం. ఆ తర్వాత నేను వద్దనుకున్నాను. శేఖర్ కమ్ముల విషయంలో కూడా అదే జరిగింది. నా వ్యక్తిగత కారణాల వల్ల కమ్ములతో తిరిగి పనిచేయలేదు. ఈ విషయంలో శేఖర్ వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు.”
ప్రస్తుతం తన దగ్గర చాలా పాటల బ్యాంకింగ్ ఉందంటున్నాడు రాధాకృష్ణన్. తన ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయని, బడ్జెట్ తో సంబంధం లేకుండా ఎవరైనా పాటల కోసం తనను సంప్రదించవచ్చని అంటున్నాడు.