పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ పెద్ద షాక్ తగిలింది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్‌తో వచ్చిన ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సోదాలు చేసి పలు డాక్యుమెంట్లను సీజ్ చేయడంతో పాటు ఆమెకు అరెస్ట్ నోటీసులు అందజేసి తమ అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత నిందితురాలనే సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అస్త్రానే ఉపయోగించింది. అప్పట్లో కవితను అరెస్ట్ చేయకుండా బీఆర్ఎస్- బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించడంతో బీజేపీకి పెద్ద దెబ్బే తగిలింది. దీంతో పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు రోజు కవితను అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయంశం అయ్యింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు ముఖ్యులు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. కవితను ఇప్పటికే పలుమార్లు ఈడీ, సీబీఐ అధికారులు విచారించారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేయవద్దని, తనకెలాంటి సంబంధం లేదంటూ ఆమె న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా అరెస్ట్ ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో చూడాలి.