‘ఏరు దాటేదాకా ఓడమల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న’ అన్నట్టుగా వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. నేరుగా ప్రజల్లో తిరిగి వారితో కలిసి మెలిసి పార్టీ పనిచేస్తూ ప్రజలకోసం నిలబడే అలవాటు లేని పచ్చమేధావి యనమల రామకృష్ణుడు ఇప్పుడు తన స్వార్థ ప్రయోజనాలను లక్ష్యించి పార్టీలో ముసలం పుట్టడానికి కారకులు అయ్యారు.
యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను తుని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు ఎంపిక చేశారు. దీంతో ఇన్నాళ్లూ అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసి సుదీర్ఘకాలం పార్టీకి సేవలందించిన యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు పార్టీ మీద ఆగ్రహిస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీకోసం కష్టపడి పనిచేస్తూ, నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను కాపాడుకుంటూ వచ్చినందుకు నన్ను పక్కన పెట్టి, దివ్యకు టికెట్ ఇవ్వడంలో అర్థమేంటి? అంటూ పార్టీని నిలదీస్తున్నారు.
అయితే తాజా పరిస్థితి ఏంటంటే.. యనమల కృష్ణుడు తెలుగుదేశాన్ని వీడడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇన్నాళ్లూ తనను నమ్ముకుని పార్టీలో కొనసాగిన కార్యకర్తలను సంప్రదించి భవిష్యత్ కార్యచరణ నిర్ణయించుకుంటానని కృష్ణుడు అంటున్నారు. కృష్ణుడు సుముఖంగా ఉంటే.. ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి వైఎస్సార్ సీపీ రెడీగా ఉంది.
నిజానికి తుని నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో యనమల కృష్ణుడే పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆ నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వానికి ఓట్లు పడడం లేదని భావించిన తెలుగుదేశం అధిష్ఠానం ఈసారి రామకృష్ణుడు కూతురు దివ్యను రంగంలోకి దింపింది. ఆమె భర్త ఐఆర్ ఎస్ అధికారికి ఎప్పటినుంచో భార్యను రాజకీయాల్లోకి పంపాలని అనుకుంటున్నారు. మొత్తానికి అది ఇప్పటికి కుదిరింది. ఇప్పుడు యనమల సోదరుల మధ్య విభేదాలు వచ్చాయి.
గతంలో దివ్య కేండిడేట్ అయినా సరే.. తనకు సమ్మతమేనని ప్రకటించిన కృష్ణుడు ఇప్పుడు తనని పక్కన పెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఓడిపోయినా సరే.. కార్యర్తలతో టచ్ లో ఉంటూ నియోజకవర్గంలో పార్టీని కాపాడుకుంటూ వస్తే ఇప్పుడు పార్టీకి మంచి రోజులు ఉన్న సమయంలో తనను పక్కన పెడతారా? అని ఆయన ఆగ్రహిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులన్నీ కూడా.. కృష్ణాగ్రహం- ధర్మాగ్రహమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే కృష్ణుడు చంద్రబాబునాయుడు బుజ్జగించగలుగుతారా? లేదా, ఆయన తన దారి తాను చూసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరుతారా అనేది వేచిచూడాలి.