సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీ నారాయణ విశాఖ ఎంపీగానే పోటీ చేస్తాను అని చెబుతూ వచ్చారు. ఆయన ఇప్పుడు విశాఖ ఉత్తరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని ప్రకటించారు. తాను స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ తరఫున ఆయన విశాఖ ఉత్తరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేస్తాను అని చెప్పారు.
ఆ పార్టీ తరఫున ప్రకటించిన తొలి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆయనే కావడం విశేషం. ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం టార్చిలైట్ గుర్తుని కామన్ సింబల్ గా ఇచ్చింది. విశాఖ ఉత్తరం నుంచే ఆయన ఎందుకు పోటీ చేస్తున్నారు అంటే ఈ మాజీ జేడీ వ్యూహం ప్రకారమే అని అంటున్నారు.
విశాఖ ఉత్తరంలో కాపులు ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, టీడీపీ అక్కడ వేరే వారికి టికెట్లు ఇస్తున్నాయి. టీడీపీ పొత్తులో ఈ సీటుని బీజేపీకి ఇస్తోంది. బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు పోటీ చేస్తారని అంటున్నారు. వైసీపీ నుంచి చూస్తే 2019లో పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిన కేకే రాజు మరోసారి అభ్యర్థిగా ఉంటారు.
ఇక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు గెలుపునకు కీలకం. దాంతో మాజీ జేడీ ఈ సీటుని ఒక ప్రణాళిక ప్రకారమే ఎంచుకున్నారు అని అంటున్నారు. ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయరాదంటూ ఉద్యమాలు చేశారు. హై కోర్టులో పిల్ కూడా దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాలు ఉద్యోగులు కూడా ఇక్కడ ఎక్కువగానే ఉంటారు. దానితో పాటు విద్యావంతులు మేధావులు ఎక్కువగా ఉండే పూర్తి అర్బన్ ఫ్లేవర్ ఉన్న సీటు ఇది.
దాంతో అన్ని విధాలుగా కలసివస్తుందనే జేడీ విశాఖ ఉత్తరం సీటుని ఎంపిక చేసుకున్నారు అని అంటున్నారు. ఆయన ఎంపీగా పోటీ చేసి ఉంటే కనుక ఎంతో కొంత టీడీపీ ఓట్లకు దెబ్బ పడి ఉండేది. కానీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం బీజేపీకి ఇచ్చిన సీటు నుంచి చేయడం పైన కూడా డిస్కషన్ సాగుతోంది.
ఇద్దరు రాజుల మధ్య ఒక సామాన్యుడి పోరు అంటూ ఈ మాజీ జేడీ తన పోటీని అభివర్ణిస్తున్నారు. తనను ప్రజలు గెలిపిస్తారో లేదో చూడాలని ఆయన అంటున్నారు. జేడీని ప్రజలు గెలిపిస్తారా లేక ఆయన పోటీ వల్ల ఏ పార్టీకి దెబ్బ అన్నది అపుడే విశ్లేషిస్తున్నారు.