చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా పెరిగిన మైలేజీని కూడా తనకు అనుకూలంగా వాడుకునే వ్యూహాత్మక ఆలోచనతో బతిమాలి బామాలి మొత్తానికి వారితో పొత్తు కుదుర్చుకున్నాడు.
జగన్ వ్యతిరేక ఓటును చీలనివ్వను, జగన్ పతనాన్ని శాసిస్తాను అంటూ ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన పవన్ కల్యాణ్, ఆ మాట నిలబెట్టుకోవడం కోసమా అన్నట్టుగా చాలా కష్టపడి ఈ పొత్తులు కుదిరేలా మధ్యవర్తిత్వం చేశారు. ఆయన మాట్లోలనే చెప్పాలంటే ‘తిట్లు తిన్నారు, కష్టాలు పడ్డారు, త్యాగాలు చేశారు’! అయితే ఇంతచేసీ వారు కుదుర్చుకున్న పొత్తు రూపేణా భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న లాభమేమీ లేదని, నిజానికి పార్టీకి చంద్రబాబు అండ్ కో వెన్నుపోటు పొడుస్తున్నారని ఆ పార్టీ ఏపీ నాయకులు కొందరు పార్టీ చీఫ్ జెపి నడ్డాకు రెండు పేజీల లేఖ రాశారు.
చంద్రబాబుతో పొత్తు కుదిరిన తీరు, పొందిన సీట్లు విషయంలో రాష్ట్రంలోని భాజపా శ్రేణులకు అనేక అనుమానాలు, భయాలు ఉన్నాయనే సంగతిని వారు తమ లేఖలో వెల్లడించారు. పార్టీ నాయకులు విష్ణువర్దన్ రెడ్డి, మాలతీ రాణి, శాంతారెడ్డి, దయాకర్ రెడ్డి, పాకా సత్యనారాయణ, వి. సూర్యనారాయణ రాజు, జూపూడి రంగరాజు ఈ లేఖ మీద సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
చంద్రబాబు ఈ పొత్తుల ద్వారా తమ పార్టీని ముంచేస్తారని, మోడీని ఆయన తన ఎన్నికల ప్రచారానికి మాత్రం పుష్కలంగా వాడుకుంటారని లేఖలో ఆరోపించారు. ఈ పొత్తులకు మేం వ్యతిరేకం కాదు, పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ దానిని శిరసావహిస్తాం, అయితే పార్టీ విశ్వసించలేని కొందరు వ్యక్తుల పేర్లు అభ్యర్థులు తెరపైకి వస్తుండడాన్న అంగీకరించలేకపోతున్నామని పేర్కొన్నారు.
భాజపాకు కేటాయించిన 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే సీట్లలో ఏవీ కూడా అటు బిజెపికి గానీ, తెలుగుదేశానికి కూడా గెలుపు అవకాశాలు ఉన్న సీట్లు కానేకాదని వారు వెల్లడించారు. తెలుగుదేశం కేటాయించిన సీట్లను గమనిస్తే ఇది ఖచ్చితంగా వెన్నుపోటు అని అర్థమవుతోందని చెప్పుకొచ్చారు.
చరిత్రలో తెలుగుదేశం పార్టీ ఎన్నడూ గెలిచి ఎరగని, వారికి ఎంతో బలహీనమైన అసెంబ్లీ సెగ్మెంట్లనే తమ పార్టీకి కేటాయించారని ఆరోపించడం విశేషం. ఏపీ బిజెపి పార్టీకోసం సేవలందిస్తున్న నాయకుల పేర్లను జాబితా ఇచ్చినప్పటికీ.. వాటిని పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు అభ్యర్థులుగా ఎంపికయ్యే వారంతా చంద్రబాబు మనుషులేననేది వారి వాదన. తన మనుషుల్ని ముందే బిజెపిలోకి పంపి, ఇప్పుడు వారికి టికెట్లు వచ్చేలా చేసుకుంటున్నారని కూడా నడ్డాకు ఫిర్యాదు చేశారు.
పాపం.. కమలదళంలో అవకాశాలు దక్కనివారు మాత్రమే కాదు.. చంద్రబాబు కుట్రలను ముందే గుర్తించిన ఈ నాయకులు ముందు జాగ్రత్తతో అధిష్ఠానానికి లేఖ రాశారు సరే.. ఈ మాటలను చెవిన వేసుకునే తత్వం పార్టీ హైకమాండ్ కు ఉందా? లేదా, పోగాలము దాపురించిన వారికి హితవాక్యములు చెవినికెక్కవు అన్నట్లుగా పట్టించుకోకుండా ఉండిపోతారా? చూడాలి.