జనసేనలో టికెట్ల లొల్లి మామూలుగా లేదు. పొత్తులో భాగంగా టికెట్లు దక్కని నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇదే సందర్భంలో పవన్‌కల్యాణ్ వైఖరిని తీవ్రస్థాయిలో తప్పు పడుతున్నారు. ఈ పరంపరలో ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి జనసేన ఇన్చార్జ్ పరుచూరి భాస్కర్‌రావు శుక్రవారం పార్టీకి గుడ్ చెప్పారు. ఈ వ్యవహారం జనసేనలో తీవ్ర చర్చనీయాంశమైంది.
అనకాపల్లిలో జనసేనను బలోపేతం చేసేందుకు మొదటి నుంచి ఆయన పని చేస్తూ వచ్చారు. గడపగడపకూ వెళ్లి జనసేనను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా అనకాపల్లి సీటు జనసేనకు దక్కింది. కానీ ఇన్చార్జ్ అయిన భాస్కర్‌రావుకు కాకుండా, ఈ మధ్య పార్టీలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణకు కేటాయించారు. దీన్ని భాస్కర్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారు.
పవన్‌కల్యాణ్ ప్రకటించిన ఐదుగురి జాబితాలో అనకాపల్లి సీటును కొణతాలకు చోటు దక్కడంతో భాస్కర్‌రావు షాక్‌కు గురయ్యారు. ఆప్పుడే ఆయన మీడియా సమావేశం నిర్వహించి కన్నీటిపర్యంతం అయ్యారు. తాజాగా ఆయన జనసేన పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి నుంచి జనసేన జెండా మోస్తున్న తన లాంటి వాళ్లకు కాకుండా, ఎన్నికల సమయంలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని తప్పు పట్టారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్టు భాస్కర్‌రావు ప్రకటించడం సంచలనం రేకెత్తిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కావడం వల్లే సీటు దక్కలేదని ఆయన అనడం చర్చనీయాంశమైంది.