టీడీపీని దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత తీవ్ర నిరాశపరిచారు. తన తండ్రి హంతుకులను కాపాడుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న డాక్టర్ సునీత, రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రకటన చేస్తారని టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకే కడపలో శుక్రవారం నిర్వహించిన వివేకా స్మారక సభపై అందరి దృష్టి పడింది.
ఈ సభలో వైఎస్ షర్మిల, సునీత ఏం చెబుతారో అనే ఉత్కంఠ కూడా నెలకుంది. మరీ ముఖ్యంగా వివేకా భార్య సౌభాగ్యమ్మ కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. సౌభాగ్యమ్మ లేదా సునీత ఎన్నికల్లో పోటీపై ఇవాళ్టి స్మారక సభలో స్పష్టత వస్తుందని అంతా అనుకున్నారు. కానీ సునీత అలాంటి ప్రకటనేదీ చేయకపోవడంతో టీడీపీ నాయకులు నీరుగారిపోయాయి.
అయితే వైసీపీని ఓడించాలని మాత్రం ఆమె బహిరంగంగానే పిలుపునిచ్చారు. వైసీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని ఆమె ఘాటు విమర్శలు చేశారు. తన అన్న వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో చేసిన ప్రమాణాన్ని ఆమె గుర్తు చేస్తూ, దాని ప్రకారం ఎక్కడ నడుచుకున్నావని నిలదీశారు. వివేకా హంతకులను పట్టుకోడానికి బదులు, తమపై ఆ నేరాన్ని మోపడం ఎబ్బెట్టుగా లేదా? అని జగన్‌ను నిలదీశారు.
అలాగే ఇదే సభలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ చిన్నాన్న వైఎస్ వివేకా ఎంతో గొప్పవాడన్నారు. చివరిసారిగా తనను చిన్నాన్న కలిసినప్పుడు రెండు గంటల పాటు ఎంపీగా పోటీ చేయాలని ఒత్తిడి చేశారని గుర్తు చేసుకున్నారు. అన్నీ అనుకూలిస్తే పోటీ చేస్తాననే హామీతో తన దగ్గరి నుంచి వెళ్లిపోయారన్నారు.
తన తండ్రి హంతకులను పట్టుకునే క్రమంలో సునీతకు ఎవరున్నా, లేకున్నా తాను అండగా వుంటానని భరోసా ఇచ్చారు. ఈ పోరాటంలో తానొక ఆయుధం అవుతానని సునీతకు భరోసా ఇవ్వడం విశేషం. ఎప్పట్లాగే తన అన్న జగన్‌పై షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.