తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జ్ కోటా వినుత ఇంటి ఎదుట టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు రచ్చరచ్చ చేశారు. టీడీపీ రెండో జాబితాలో శ్రీకాళహస్తి నుంచి బొజ్జల సుధీర్‌రెడ్డికి చోటు దక్కింది. ఇదే సీటును జనసేన ఇన్చార్జ్ కోటా వినూత ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె శ్రీకాళహస్తి నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓటమి మూట కట్టుకున్నారు. అనంతరం ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో బొజ్జల సుధీర్‌కు టికెట్ దక్కడం విశేషం. ఈ ఆనందంలో బొజ్జల అనుచరులు వినూత ఇంటి ఎదుట పెద్ద ఎత్తున టపాసులు పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ఆశించి భంగపడ్డ వినూతను వెటకరించే క్రమంలో బొజ్జల అనుచరులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
టికెట్ రాలేదని గుర్తు చేసి, మరీ తమ ఆనందాన్ని ఆమె ఇంటి ఎదుటే ప్రదర్శించడం జనసేనకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. మరోవైపు జనసేన కార్యాలయం వద్దకెళ్లి ఆ పార్టీ కార్యకర్తలు, మహిళలపై బొజ్జల అనుచరులు దాడికి పాల్పడ్డారు.
దీంతో జనసేన బాధితులంతా వినూత ఇంటి వద్దకెళ్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌కల్యాణ్, మీ కోసం కుటుంబ సభ్యులంతా కష్ట పడుతున్నామని, కానీ తమపై టీడీపీ నేతలు దాడికి పాల్పడడం ఏంటని వినూత భర్తను నిలదీయడం గమనార్హం. తమ నాయకురాలికి టికెట్ రాలేదనే బాధలో తాము వుంటే, బొజ్జల అనుచరులు ఇంటి వద్దకొచ్చి టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటూ, అవహేళన చేయడం పొత్తు ధర్మమేనా? అని జనసేన కార్యకర్తలు ప్రశ్నించారు. ఇలాగైతే టీడీపీ కోసం తామెందుకు పని చేయాలని జనసేన కార్యకర్తలు నిలదీయడం గమనార్హం.