సాక్షి వ్యాపారం మీద కూడా ఈనాడుకు ఏడుపే!

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్లడంలో సగటు చవకబారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటె నీచంగా ఈనాడు దినపత్రిక ఎలాంటి వంటకపు కథనాలతో రెచ్చిపోతున్నదో అందరికీ తెలుసు. ప్రతిరోజూ ఆ పత్రిక చూసేవాళ్లకి…

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద బురద చల్లడంలో సగటు చవకబారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటె నీచంగా ఈనాడు దినపత్రిక ఎలాంటి వంటకపు కథనాలతో రెచ్చిపోతున్నదో అందరికీ తెలుసు. ప్రతిరోజూ ఆ పత్రిక చూసేవాళ్లకి ఆసంగతి బాగానే అర్థమవుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ నిర్ణయమూ సమాజానికి చేటు చేయడానికే అన్నట్టుగా వారు వార్తల్ని వండి వారుస్తున్న తీరు, అసత్యాలతో ఆ పత్రికను నింపుతున్న తీరు ఎవ్వరికైనా కంపరం పుట్టిస్తాయి.

కేవలం తమ పచ్చ మీడియా తలచుకుంటే చాలు.. జగన్ ను అధికారం నుంచి పతనం చేయించగలమనే అహంకారం ఈనాడు రాతల్లో ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంటుంది. తాజా పరిణామాలను గమనిస్తోంటే.. కేవలం జగన్ మీద రాజకీయద్వేషం మాత్రమే కాదు, సాక్షి దినపత్రిక మీద వ్యాపారపరమైన విషాన్ని చిమ్మడంలో కూడా ఈనాడు ఆరితేరిపోయిందని అనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండేందుకు గాను.. ప్రజలతో నిత్యం మమేకమై ఉండే వాలంటీర్లు అందరూ ఒక దినపత్రికను కొనుగోలు చేసేందుకు వారికి భత్యం కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతినెలా పత్రిక చందాకు సరిపడా మొత్తాన్ని వాలంటీర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. వారు తమకు నచ్చిన దినపత్రికను కొనుక్కోవచ్చు. వాలంటీర్లు అందరూ కూడా ఫలానా పత్రికనే కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం ఎక్కడా ఉత్తర్వుల్లో చెప్పలేదు. అయితే చాలా సహజంగా ప్రభుత్వం పథకాల గురించి పాజిటివ్ కథనాలు వస్తున్న సాక్షినే వాలంటీర్లు అందరూ కొంటున్నారు.

ఈ వ్యవహారం ఒక అక్రమంలాగా ఈనాడుకు కనిపించింది. ఆ వైనంపై అనేక వార్తా కథనాలు రాసి అలసిపోయిన ఈనాడు, దిల్లీ హైకోర్టులో కేసు కూడా వేసింది. ప్రభుత్వ నిధులను ఈ రూపంలో ప్రెవేటు సంస్థ అయిన సాక్షికి మళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ నిర్ణయం వలన సాక్షికి సర్కులేషన్ పెరిగినట్టుగా చూపిస్తున్నారని.. కాబట్టి సాక్షి సర్కులేషన్ గణాంకాలను గుర్తించకూడదని ఈనాడు వాదించింది. దిల్లీ హైకోర్టు, సాక్షి సర్కులేషన్ గణాంకాలను ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్కులేషన్ (ఏబీసీ) వారు ప్రచురించకూడదంటూ స్టే ఉత్తర్వులు ఇచ్చింది.

ఏబీసీలో ప్రచురితమయ్యే సర్కులేషన్ గణాంకాలను ప్రామాణికంగా భావిస్తారు. వాలంటీర్లు కొనే పత్రికల సర్కులేషన్ కూడా తోడైతే సాక్షి సర్కులేషన్ ఈనాడును ఎన్నడో దాటిపోతుంది. అప్పుడు వ్యాపారపరంగా సాక్షి తమను మించిపోతుందని, వారి వ్యాపార మూలాలను దెబ్బతీయడానికి ఈనాడు ఈ కుట్ర చేసినట్టుగా కనిపిస్తోంది. జగన్ ప్రభుత్వం మీద బురదచల్లడంతోపాటు, సాక్షి వ్యాపారాన్ని కూడా దెబ్బతీయడానికి ఈనాడు వక్రపూరిత కుట్రలకు పాల్పడుతున్నట్టుగా ఉన్నదని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.