ఎన్టీఆర్‌ని గొప్ప నటుడంటారు కానీ, చంద్రబాబు ముందు కానేకాదు. ఎన్టీఆర్ సినిమాలకో ప్రత్యేకత వుంది. కనీసం నూరు సినిమాల్లో మారువేషాలు వేసి వుంటాడు. 60-70లో వచ్చిన ప్రతి సినిమాలోనూ వుంటాయి. విలన్‌ని మూర్ఖుడిగా ఏమార్చడానికి ఎన్టీఆర్ పిల్లి గడ్డం పెట్టుకుని వస్తే నాగభూషణం, రాజనాల, సత్యనారాయణ ఎంతటి గొప్ప విలన్ అయినా కనిపెట్టలేరు.
సినిమాల్లో ఎంతో మంది విలన్లని బురిడీ కొట్టించిన నటరత్న ఎన్టీఆర్, తన అల్లుడు పిల్లిగడ్డంతో వస్తే గుర్తు పట్టలేక పోయాడు. ఇక్కడ విలన్ మారువేషంలో వచ్చి హీరోని ముంచేశాడు. జీవితానికి, సినిమాకి తేడా ఇదే.
కొన్నేళ్ల పాటు మారువేషంలో నడుస్తూ వున్న చంద్రబాబుని ఎన్టీఆర్ గుర్తు పట్టలేక పదవి పోయిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. వంద మంది రాజనాలాలతో యుద్ధం చేసిన ఎన్టీఆర్ ఒక చంద్రబాబు చేతిలో ఓడిపోయాడు. బాబు అంతటితో ఆగకుండా ఇంకో హీరో హరికృష్ణ (కొన్ని సినిమాల్లో హీరోనే) దగ్గరికొచ్చి ప్రియమైన బావ వేషం వేసాడు. ఆర్టీసీ మంత్రి పదవి ఇచ్చి అండగా వుంటానని నమ్మబలికాడు. తండ్రిని కాదనుకుని బావని నమ్మాడు హరి.
ఏరుదాటాక చంద్రబాబు మాస్క్ తీసేస్తే జడుసుకున్నాడు. అప్పటికే సమయం మించిపోయింది. కొంత కాలం పోరాడి రాజీపడ్డాడు. తర్వాత ఆయన కొడుకు జూనియర్ ఎన్టీఆర్ వంతు వచ్చింది. ప్రచారం కోసం బాబు ప్రేమ నటించాడు. లోకేశ్‌కి అడ్డం వస్తాడని తెలిసి ముసుగులు తొలగించి పార్టీలోంచి పక్కన పెట్టాడు.
ఇంకా బాలకృష్ణ. ఆయన బోళా మనిషి. పెద్దగా మారువేషం అక్కర్లేదు. సులభమైన పద్ధతిలో వియ్యంకుడి అవతారం ఎత్తాడు. బాలకృష్ణతో పెద్ద పేచీ లేదు.
ఇప్పుడు పవన్‌కల్యాణ్.. అత్తారింటికి దారేదిలో పవన్ మారువేషం వేసి బ్రహ్మానందాన్ని బకరా చేస్తాడు. కానీ రాజకీయాల్లో తానే బ్రహ్మానందం అని కనిపెట్టలేకపోయాడు. చంద్రబాబు స్నేహహస్తం కబంధ హస్తం అని తెలుసుకోలేకపోయాడు.
బీజేపీతో యాక్సెస్ కోసం పవన్ ఒక పావు మాత్రమే. ఈ గేమ్‌లో చంద్రబాబు మారువేషం వేయడమే కాకుండా తన మనుషులందరినీ మారువేషాల్లో జనసేన, బీజేపీలో చేర్చాడు.
పవన్‌కి, చంద్రబాబుకి ఒకటే తేడా. పవన్ గడ్డం గీసుకుంటాడు. చంద్రబాబు గీసుకోడు. కాకపోతే ముసలి సింహం. వేటాడే శక్తిలేక ఇంకెవరితోనో వేటాడిస్తుంది.
రేపు పిఠాపురంలో వర్మను రెచ్చగొట్టి ఓటమి దిశగా తీసుకెళ్తారు. ఇది పవన్ తెలుసుకోలేని ఇంకో మారువేషం.
సినిమా హీరోలు రాజకీయాల్లో కమెడియన్లగా ఎందుకు మారుతారంటే ఇక్కడ విలన్లదే రాజ్యం.