వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్‌చార్జ్ జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి ఏడ్పు ఒక్కటే తక్కువ. లోకేశ్‌ను నమ్ముకోవడం వల్లే టికెట్ లేకుండా పోయిందని, పార్టీ కోసం మూడేళ్లుగా పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైందని ఆయన కుటుంబ సభ్యులు లదోదిబోమంటున్నారు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే, పార్టీలో అంత ప్రాధాన్యం వుంటుందనే లోకేశ్ మాటలు నిజమే అనుకుని, అయినదానికి, కానిదానికి రచ్చ చేసి ప్రవీణ్ జైలుపాలయ్యారు.
ఒకసారి ప్రవీణ్‌ను చూసేందుకు లోకేశ్ కడప సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఈ సందర్భంగా జైలు బయట లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి ప్రవీణే అని ప్రకటించారు. ఆ తర్వాత యువగళం పాదయాత్రలో కూడా యువకుడిని ఆదరించాలని పరోక్షంగా ప్రవీణే అభ్యర్థి అనే సంకేతాలు ఇచ్చి వెళ్లారు. లోకేశ్ మాట ఇస్తే తిరుగు వుండదని ప్రవీణ్ నమ్మారు.
తనకు లోకేశ్ అండ వుందనే కారణంతో పెద్దాచిన్నా లేకుండా, చివరికి పార్టీలోని పెద్దల్ని కూడా లెక్క చేయలేదు. టీడీపీ ఇన్‌చార్జ్‌గా ప్రొద్దుటూరులో సొంత పార్టీ నాయకులందరినీ కలుపుకెళ్లే ప్రయత్నం చేయలేదు. పైగా వారిని ఉద్దేశించి, విమర్శలు చేస్తూ వచ్చారు. అభ్యర్థి ఎంపిక సమయానికి… ప్రవీణ్ బరిలో నిలబడలేకపోయారు.
సర్వేల్లో మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి అనుకూలత కనపడింది. దీంతో వరదరాజులరెడ్డిని చంద్రబాబునాయుడు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కష్టకాలంలో పార్టీ జెండా మోసి, అధికార పార్టీ వేధింపులకు గురై, పలుమార్లు జైలుకెళ్లిన తనను కాదని వరదకు టికెట్ ఇవ్వడంపై ప్రవీణ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. లోకేశ్ వర్గీయుడిగా గుర్తింపు పొందడం వల్లే తనకు టికెట్ దక్కలేదని సన్నిహితుల వద్ద అతను వాపోతున్నారు.
టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు వరదరాజులరెడ్డి ఎక్కడున్నాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం తనతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించారని ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల సమయంలో వరదరాజులరెడ్డి హడావుడి చేయడం, ఆయనకే టికెట్ ఇవ్వడం ఏంటంటూ ప్రవీణ్ ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.