కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పవన్‌కల్యాణ్ పోటీపై స్పష్టత వచ్చింది. పిఠాపురం నుంచి బరిలో వుంటానని స్వయంగా పవన్‌కల్యాణే ప్రకటించారు. తమ అభిమాన అధినేత పోటీ ఎక్కడి నుంచో తేలడంతో జనసేన శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించగానే… మంగళగిరిలోని జనసేన కార్యాలయ సమావేశ మందిరంలో అభిమానుల కేరింతలతో మార్మోగింది.
అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మంగళగిరిలో పవన్ కామెంట్స్, పిఠాపురంలో అగ్గి రాజేశాయి. పిఠాపురం టీడీపీ కార్యాలయంలో ఇన్చార్జ్ వర్మ అనుచరులు విధ్వంసానికి తెగబడ్డారు. టీడీపీ జెండాలు, ప్లెక్సీలు, వాల్‌పోస్టర్లు తగులబెట్టారు. కుర్చీలను విరగ్గొట్టారు. పవన్‌పై ముఖ్యంగా మహిళా కార్యకర్తలు శాపనార్థాలు పెట్టారు. పిఠాపురంలో వర్మకు కాకుండా పవన్‌కు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని హెచ్చరించారు.
పిఠాపురం నుంచి పవన్ చేస్తానని ప్రకటించిన కొద్ది సేపటికే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ వర్మ తాను కూడా బరిలో వుంటున్నట్టు ఎక్స్‌లో పోస్టు పెట్టడం విశేషం. ఈ పరిణామాలపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. దీని వెనుక ఏదో కుట్ర వుందని వారు అనుమానిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ సర్వ శక్తులు ఒడ్డుతారని జనసేనానితో సహా అందరూ అనుకున్నారు.
అయితే అందుకు విరుద్ధంగా మిత్రపక్షమైన టీడీపీనే ఆ పని చేయడాన్ని జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పిఠాపురంలో తన పోటీపై నెల క్రితమే చంద్రబాబు, లోకేశ్‌కు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్చార్జ్ వర్మను పిలిపించుకుని పవన్‌కు సహకరించాలని స్పష్టం చేసి వుండాలి. నిజాయతీగా ఆ పని చంద్రబాబు, లోకేశ్ చేసి వుంటే, ఇవాళ పిఠాపురంలో టికెట్‌పై మంటలు చెలరేగి వుండేవా? అని జనసేన కార్యకర్తలు, నాయకులు నిలదీస్తున్నారు.
అభ్యర్థుల ప్రకటన తర్వాత పిఠాపురం స్థాయి మంటలు ఎక్కడా లేవని జనసేన శ్రేణులు గుర్తు చేస్తున్నారు. పిఠాపురంలో పవన్‌కల్యాణ్ గెలుపు కోసం టీడీపీ చిత్తశుద్ధితో పని చేయకపోతే తాము కీలక నిర్ణయం తీసుకోవాల్సి వుంటుందని జనసేన శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. ఏకంగా తమ నాయకుడినే ఓడించడానికి టీడీపీ పని చేస్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీని మట్టి కరిపించే వరకూ విశ్రమించమని జనసేన నాయకులు వార్నింగ్ ఇస్తున్నారు. పిఠాపురంలో చిచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూటమిని దహించి వేసేలా వుంది.