కలలు ఎవరైనా కంటారు. నిజం కావాలంటే లక్ష్యం దిశగా ప్రయాణం చేయాలి. కలలు దైవంతో సమానం. చేరాలంటే నడిచే వెళ్లాలి. వాహనాలు వెళ్లవు. చెమటలు కక్కుతూ వెళ్లాలి. ఆగిపోయి వెనుతిరిగే వాళ్లే ఎక్కువ.
అక్షరకుమార్ వెనక్కి రాలేదు. ముందుకే వెళ్లాడు. గోదావరిఖని బొగ్గు గనుల మధ్య పుట్టాడు. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. అన్నీ తానై తల్లి సాకింది. చిన్న ప్రపంచం, ఆర్థిక బలం లేని ప్రపంచం. బొగ్గు దూళి మధ్య వజ్రసమాన కల కన్నాడు. సినిమా డైరెక్టర్ కావాలని. చిన్న జీవితానికి పెద్ద కల.
హైదరాబాద్‌కి ప్రతిరోజూ ఆకాంక్షల లగేజీతో కలర్‌ఫుల్ కలలతో ఎంతో మంది రైలు దిగుతారు. చాలా మంది ఖాళీ సూట్ కేస్‌తో తిరిగి వెళ్లిపోతారు. నగరం గురించి అక్షరకి తెలుసు. కనిపించేది , కనపడనిది ఏదీ నిజం కాదు, అబద్ధమూ కాదు. చిరు నవ్వుల వెనుక చురకత్తులు, కరచాలనం వెనుక కరవాలం.
జీవితం అంటే అదే కదా. చూసే వచ్చాడు. చూస్తూనే వచ్చాడు. నర్సింగ్ కోర్స్ చేసి, మేల్ నర్స్‌గా పని చేశాడు. ఆర్థికంగా ఎవరికీ భారం కాదనే భరోసాతో సినిమా వైపు అడుగులు.
సినిమాకి సంబంధించిన ప్రతి వాళ్లనీ కలిశాడు. కార్మికులు, కళాకారులు, రచయితలు, టెక్నీషియన్స్. ఇదే ప్రపంచం. ఒక్కో అడుగూ కూడదీసుకున్నాడు. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని. కష్టం, నష్టం , కన్నీరు, కాసింత ఆనందం అన్నీ చూశాడు.
వెతికే వాడికే ఏదైనా దొరుకుతుంది. అవకాశం వచ్చింది. ఆనందం కూడా. ఫలితం షరతులు వర్తిస్తాయి సినిమా. రెండేళ్ల కష్టం. కలగనడానికి డబ్బులు అక్కర్లేదు. సినిమా తీయాలంటే డబ్బులు కావాలి. ఆర్ట్ తెలిస్తే చాలదు. డబ్బు లక్షణం తెలియాలి. నమ్మిన నిర్మాతలు నష్టపోకూడదనే ఆరాటం, సినిమా బాగా రావాలనే పోరాటం. ఈ ఘర్షణలో అనేక సినిమా కష్టాలు.
జీవితం అబ్జర్డ్ అని కామూ చెప్పక్కర్లేదు. అనుక్షణం అదే చెబుతూ వుంటుంది. షూటింగ్‌కి బయల్దేరిన అసిస్టెంట్ డైరెక్టర్లను ఒక వ్యాన్ వచ్చి గుద్దింది. ఇలాంటి ఉత్పాతాలను ఎన్నో ఎదుర్కొన్నాడు.
ఈ లోకం ఎప్పుడూ ఒంటరిది కాదు. మన కోసమూ వుంటారు. ఎందరో మంచోళ్లు అక్షర కోసం నిలబడ్డారు.
రైతుల్ని, దిగువ మధ్య తరగతి వాళ్లని సినిమా తెర నుంచి బయటికి నెట్టేసిన కాలంలో తెలంగాణ రచయితలు, దర్శకులు వాళ్ల కాళ్లకి దండం పెట్టి సినిమాని సుసంపన్నం చేస్తున్నారు.
కరీంనగర్‌లోని చిన్న కాలనీలో జరిగే కథ. బాగా బతకాలనే కోరికతో, బాగా బతకలేక పోతున్న చాలా మంది కథ. అచ్చమైన కరీంనగర్ మనుషులు, యాస.
షరతులు వర్తిస్తాయి అద్భుతం, గొప్ప సినిమా అని చెప్పను. అది ప్రేక్షకులు చెప్పాలి. అయితే మంచి సినిమా, నిజాయతీతో తీసిన సినిమా. మన జీవితాన్ని, పక్కింటి మనుషుల్ని పరిచయం చేసే సినిమా.
చూడడానికి షరతులు వర్తించవు. శుక్రవారం నుంచి థియేటర్‌లో వుంది.
జీఆర్ మహర్షి