వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ప్రకటనలో సెంటిమెంట్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 2019 ఎన్నికలప్పుడు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద తన పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరినీ ప్రకటించారు. ఎన్నికల్లో కనీవినీ ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దఫా కూడా అదే సంప్రదాయాన్ని పాటించడానికి ఈ నెల 16న ఆయన ఇడుపులపాయకు చేరుకోనున్నారు.
దీంతో అందరి దృష్టి ఇడుపులపాయ వైపే. ఇంత వరకూ వైసీపీ అధిష్టానం 12 జాబితాలు విడుదల చేసి కొత్త సమన్వయకర్తల్ని నియమించింది. పరోక్షంగా వారినే అభ్యర్థులుగా చెప్పకనే చెప్పారు. కేవలం మార్చే స్థానాల్లోనే సమన్వయకర్తలను నియమించారు. మార్చాల్సిన అవసరం లేని చోట ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే వాళ్లందరికీ టికెట్ ఖరారైనట్టే లెక్క. వైసీపీ అభ్యర్థులెవరనేది బహిరంగ రహస్యమే. అధికారిక ప్రకటన కేవలం లాంఛనమే.
అయితే ఇడుపులపాయలో వైఎస్సార్ ఆశీస్సులతో అభ్యర్థులను ప్రకటించనున్నారు. కొన్ని నెలలుగా వైసీపీ అభ్యర్థుల ఎంపికపై జగన్ తీవ్ర కసరత్తు చేశారు. పలుమార్లు సర్వేలు చేయించి బాగా లేని చోట సిటింగ్ ఎమ్మెల్యేలను ఆయన అప్రమత్తం చేశారు.
అలాగే తాడేపల్లిలో ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి, పద్ధతి మార్చుకోవాలని, సర్వేల్లో బాగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్ ఇచ్చే ప్రశ్న వుండదని సీఎం జగన్ నేరుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి వచ్చే సరికి కొందరు సిటింగ్‌లకు టికెట్లు దక్కలేదు. టికెట్లు రాని వాళ్లలో కొందరు ఇతర పార్టీల్లో చేరిపోయారు. అలాగే జగన్ వద్దనుకున్న వారు సైతం టీడీపీ, జనసేనలలో చేరి ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఏది ఏమైనా ఇడుపులపాయలో వైఎస్సార్ ఆశీస్సులు పొంది, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఉత్సాహం చూపుతున్నారు.