ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి బిగ్‌షాక్. ఈ నెల 16న టీడీపీ కీలక నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి సొంత అన్న, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి టీడీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. రాయచోటి టీడీపీ టికెట్‌ను ఆయన ఆశించారు. అయితే ఆయనకు కాదని రాంప్రసాద్‌రెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు.
దీంతో రమేష్‌రెడ్డి తీవ్ర మనస్తాపం చెందారు. రాయచోటి బరిలో స్వతంత్ర అభ్యర్థిగా నిలవాలని ఆయన నిర్ణయించుకుని, మళ్లీ ఆ ఆలోచనను విరమించుకున్నారు. చంద్రబాబునాయుడు మాట్లాడి బుజ్జగించినప్పటికీ రమేష్‌రెడ్డి మనసు మార్చుకోలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీకి చేయకూడదని, వైసీపీలో చేరాలని అనుచరుల ఒత్తిడి మేరకు ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 16న ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఆయన చేరికతో రాయచోటిలో వైసీపీ విజయం నల్లేరు మీద నడక కానుంది. మాజీ మంత్రి దివంగత రాజగోపాల్‌రెడ్డి తనయుడే రమేష్‌రెడ్డి. ఈయన తమ్ముడు శ్రీనివాస్‌రెడ్డి కడప టీడీపీ అభ్యర్థి. అలాగే రమేష్‌రెడ్డి తమ్ముడి భార్య మాధవీరెడ్డి కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి కావడం విశేషం.
ఉమ్మడి కడప జిల్లా టీడీపీలో కీలక పాత్ర పోషించే శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులే ఆ పార్టీని వీడుతుండడం గమనార్హం. రాష్ట్రంలో మరోసారి వైసీపీ గాలి వీస్తుండడంతో టీడీపీ వైపు నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇటీవలే టీడీపీ నాయకుడు ఎస్వీ సతీష్‌రెడ్డి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.