వైసీపీ ఎమ్మెల్యే పుట్టిన రోజున బల ప్రదర్శన చేసి తన సత్తా చాటారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ గురువారం జన్మదిన వేడుకలను క్యాడర్ ఉత్సాహంగా జరుపుకుంది. నాలుగు వేల మంది తో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఎటు చూసిన వైసీపీ జెండాలతో ఎచ్చెర్లను రెపరెపలాడించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో గొర్లె కిరణ్ కుమార్ ధాటీగా స్పీచ్ ఇచ్చారు. తన దేవుడు, కుటుంబం కంటే ప్రాణం కంటే ఎక్కువ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ కీర్తించారు. 2024 ఎన్నికల్లో 2019 కంటే అత్యధిక మెజారిటీతో గెలిచి జగన్ కి ఎచ్చెర్లను బహుమతిగా ఇస్తామని సభా సాక్షిగా కిరణ్ కుమార్ శపధం చేశారు.
ఎచ్చెర్ల వైసీపీకి కంచుకోట అని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ని ఎవరూ వదులుకోరని అలాగే ఎచ్చెర్ల ప్రజలు అంతా వైసీపీ వెంటే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను మళ్లీ రెండవసారి గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాను అని కిరణ్ కుమార్ అటు ప్రత్యర్ధులకు ఇటు సొంత పార్టీలోని వ్యతిరేకులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
ఎచ్చెర్లలో కిరణ్ కుమార్ కి ప్రజాదరణ లేదని, ఆయన్ని పార్టీలో మెజారిటీ వ్యతిరేకిస్తున్నారని, ఈసారి టికెట్ కష్టమని ఎచ్చెర్లలో వైసీపీ ఓడుతుందని వస్తున్న అన్ని రకాలైన వార్తలకు తనదైన శైలిలో కిరణ్ కుమార్ చెక్ పెట్టేశారు అని అంటున్నారు. తనకు పార్టీలో ఎంత బలం ఉందో ప్రజలలో ఆదరణ ఎంత ఉందో చాటి చెప్పడానికి అన్నట్లుగా పుట్టిన రోజు వేడుకలను ఆయన వేదికగా చేసుకుని బల ప్రదర్శన చేశారు అని అంటున్నారు.
ఈసారి కూడా వైసీపీదే తానే ఎమ్మెల్యే అని చెబుతున్న గొర్లెకి టికెట్ ఖాయమేనా లేక ఆయనే ఇలా జన బలం ఉందని చెప్పి కన్ ఫర్మ్ చేయించుకుంటారా అన్నది వైసీపీ లోపలా బయటా వినిపిస్తున్న మాట. గొర్లెకి మళ్ళీ టికెట్ ఇస్తారని ఆయన అనుచరులు బలంగా నమ్ముతున్నారు.