తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి? పార్టీ ప్రస్తుతానికి ఓటమి పాలై ఇబ్బందులు పడుతోంది సరే. ఆ పార్టీ భవిష్యత్తు అయినా ఆశావహంగా ఉండబోతున్నదా లేదా అనే మీమాంస ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
సాధారణంగా ఎన్నికల సీజను వస్తే, అవి ఏ స్థాయి ఎన్నికలు అయినా సరే, టికెట్ల కోసం నాయకులు ఎగబడుతూ ఉంటారు. సిటింగ్ ప్రతినిధులు ఉన్నచోట కూడా వారిని కాదని తమకు టికెట్లు ఇవ్వాలంటూ నాయకులు కోరుతుంటారు. కానీ గులాబీ దళంలో పరిస్థితి ప్రస్తుతం చాలా భిన్నంగా కనిపిస్తోంది.
ఎంపీ ఎన్నికల్లో తమకు టికెట్లు వద్దంటే వద్దని నాయకుల పక్కకు తప్పుకుంటున్నారు. సిటింగ్ ఎంపీలు కొందరు ఆల్రెడీ ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. మిగిలిన సిటింగ్ ఎంపీల్లో కూడా పోటీ మీద ఉత్సాహం ఉండడం లేదు. ఇలాటి పరిణామాలను గమనిస్తోంటే ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందో కదా అనిపిస్తోంది.
వరంగల్ ఎంపీగా పోటీ చేయించాలని కేసీఆర్ అనుకున్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వ్యవహారమే భారాస దయనీయ స్థితికి ఒక పెద్ద ఉదాహరణ. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆయన పార్టీమారాలని అనుకున్నారు. కేసీఆర్ ఆయనకు వరంగల్ ఎంపీ సీటు ఆఫర్ చేయడం ద్వారా శాంతింపజేశారు.
మూడు రోజుల కిందట ఎంపీగా పోటీచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఏం మంతనాలు నడిచాయో తెలియదు గానీ.. భాజపాలో చేరబోతున్నట్టు ప్రకటించడానికి ఇంట్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. హుటాహుటిన గులాబీ నాయకులు, కేసీఆర్ దూతలు ఆయన వద్దకు వచ్చి ప్రెస్ మీట్ లో కూర్చోబోతుండగా లేపి, తమ వెంట హైదరాబాదు తీసుకువెళ్లారు.
కేసీఆర్ ఇంట్లో ఓ చిన్న మీటింగు పెట్టుకున్నారు. ఆయనను బుజ్జగించారు. ఆయన మెత్తబడినట్టే కనిపించారు. కానీ వరంగల్ సీటు నుంచి ఎంపీగా పోటీచేయడానికి మాత్రం విముఖత చూపారు. ఆయన కోరినదే, రెండు రోజుల ముందర ఒప్పుకున్నదే. కానీ తాజాగా వద్దన్నారు. అక్కడ సిటింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా పెద్ద ఉత్సాహంగా లేరు. పార్టీ టికెటిస్తే పోటీచేస్తా లాంటి మాటలు మాత్రమే చెప్పారు. మెత్తబడినట్టు కనిపించినా ఆరూరి రమేష్ పార్టీ మారడం తథ్యం అనే అభిప్రాయమే పలువురిలో ఉంది. ఇంతవరకూ వచ్చాక పార్టీ పరువు పోకుండా ఉండడం కోసం కేసీఆర్ అప్పటికప్పుడు కడియం శ్రీహరి కూతురు కావ్య ను వరంగల్ అభ్యర్థిగా ప్రకటించారు.
చేవెళ్ల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. వరంగల్ అంతటి హైడ్రామా లేకపోయినా అక్కడి ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీచేయడానికి సుముఖంగా లేరు! దాంతో కొత్త అభ్యర్థి వెతుకులాటలో కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర్ కు టికెట్ కేటాయించారు. ఇలా టికెట్ ఇస్తానంటే నేతలు వద్దంటున్నారంటే.. ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉన్నట్టే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.