ఎన్నికల సీజన్ ఇప్పటికే మొదలై చాలా కాలం అయ్యింది. ఇప్పటికే సిద్ధం సభలను నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది తెలియనిది కాదు. ఐతే ముద్రగడ పద్మనాభం చేరిక విషయంలో వస్తున్న అప్ డేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ సత్తాను చాటే ఒక అవకాశాన్ని కోల్పోయిందనిపిస్తోంది. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం.. మార్చి 14న ముద్రగడ పద్మనాభం భారీ జనసమూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వచ్చాయి.
పవన్ కల్యాణ్ తో పొత్తు ద్వారా కాపులు తమవైపు ఉన్నారనే భ్రమతో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలాంటి నేపథ్యంలో కాపు ఉద్యమ నేపథ్యం ఉన్న ముద్రగడ భారీ జనసందోహం మధ్యన సాగి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఉంటే.. టీడీపీకి అది పెద్ద ఝలక్ అయ్యేది! జస్ట్ కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి ఛాన్సిచ్చేస్తే ఇక కాపుల ఓట్లు తమకు పవన్ కల్యాణ్ రాసిచ్చేసినట్టే అనే లెక్కలో ఉన్న టీడీపీకి అప్పుడు గొంతులో వెలక్కాయ పడినట్టుగా అయ్యేది!
అయితే ముద్రగడ చేరిక విషయంలో.. ఇప్పుడు జనసందోహం లేదనే వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణాలు ఏమైనా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి అవకాశాన్ని కోల్పోయింది. ముద్రగడ చేరికను భారీ ఎత్తున వేడుకగా మార్చి ఉంటే.. రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడే వారికి కూడా మతి గిర్రున తిరిగేది!
తెలుగుదేశం, బీజేపీల మధ్యన పవన్ కల్యాణ్ పరిస్థితి ఆటలో అరటిపండు అయిపోయింది. జనసైనికుల ఉత్సాహం నీరుగారిపోయింది. 21 సీట్లలో పోటీకే ఆ పార్టీ పరిమితం అయిపోయిన తీరు వారిని నిశ్చేష్టులను చేస్తోంది. ఇప్పుడు ముద్రగడ వంటి వారి చేరిక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అనేది భారీ ఎత్తున హైలెట్ చేసుకుని ఉంటే.. టీడీపీకి కూడా కూసాలు కదిలిపోయేవి! అది కూడా జనసందోహాన్ని సొంత ఖర్చులతో రావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. అది మరింతగా హైలెట్ అయ్యేది.
ముద్రగడ చేరిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభదాయకమే అయినా.. అది జనసందోహంతో సాగి ఉంటే వేరే లెవల్లో ఉండేది! ఆ హైలెట్ పాయింట్ ఇక్కడ మిస్ అవుతోంది! ఆ తర్వాత అయినా భారీ సభతో ఈ అవకాశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకునే ఛాన్స్ మాత్రం మిగిలే ఉంది.