జనసేనాని పవన్‌కల్యాణ్‌పై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భీమవరం టీడీపీ ఇన్‌చార్జ్ రామాంజనేయుల్ని జనసేనలో చేర్చుకుంటున్న సందర్భంలో పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌తో పాటు గ్రంధి శ్రీనివాస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. భీమవరం ఎమ్మెల్యేని రౌడీ అని తిట్టారు. సీఎంగా జగన్‌ను గద్దె దించడం, భీమవరంలో వైసీపీ ఎమ్మెల్యేని ఓడించడం తన లక్ష్యమన్నారు.
ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ని తన్ని తరిమేయాలని ఆయన పిలుపునిచ్చారు. భీమవరంలో ఇల్లు, పార్టీ కార్యాలయం కట్టుకునేందుకు స్థలం కొందామంటే, ఎమ్మెల్యేకి భయపడి ఇవ్వలేదని పవన్ సంచలన ఆరోపణ చేశారు. అనేక ఆరోపణలపై గ్రంధి శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్ మానసిక పరిస్థితి బాగా లేదన్నారు. అది ముదిరిపోతే ఏ పరిస్థితికి దారి తీస్తుందో తెలియదన్నారు.
పవన్ శ్రేయోభిలాషులు ఆయనకు ఎర్రగడ్డ లేదా మరెక్కడైనా మానసిక వైద్యశాలలో చూపించాలని గ్రంధి సూచించడం గమనార్హం. ఎప్పుడు కూడా వ్యాధుల్ని, రోగాల్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వెంటనే వైద్యం అందించాలన్నారు. ఒకవేళ వైద్యం అందించకపోతే ప్రాణాంతకం అవుతుందని హెచ్చరించారు. పవన్ మాటల్ని చూస్తే సమాజానికే ప్రమాదంగా కనిపిస్తోందని తప్పు పట్టారు.
విద్య, వైద్య సంస్థలకు విలువైన భూముల్ని దానం చేశానని భీమవరం ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. భీమవరంలో పోటీ చేశాడని, ఆ తర్వాత ఎప్పుడైనా కన్నెత్తి చూశావా? అని గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో కనీసం తనకు ఓట్లు వేసిన వాళ్లనైనా పట్టించుకోలేదని విమర్శించారు. ఏదైనా సాయం చేయాలన్న స్పృహే లేని వ్యక్తి పవన్‌కల్యాణ్ అని ఆయన తప్పు పట్టారు.
పదేళ్లు భీమవరం ఎమ్మెల్యేగా పని చేసి అక్రమాలకు పాల్పడిన పులిపర్తి రామాంజనేయుల్ని పక్కన పెట్టుకుని , ఆయన్ను ప్రశ్నించకపోవడం విడ్డూరంగా వుందన్నారు. ఆయన మానసిక పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తనను రౌడీ అని విమర్శించడంపై గ్రంధి వ్యంగ్యంగా మాట్లాడారు. చిరంజీవికి, పవన్‌కు పోలికే లేదని ఆయన విమర్శించారు.
భీమవరంలో ఇల్లు కట్టుకుందామనుకుంటే స్థలం ఇవ్వకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారనే ఆరోపణలను ఆయన కొట్టి పారేశారు. సినిమాలో బ్రహ్మానందం కామెడీని తలపిస్తోందని ఆయన సెటైర్ విసిరారు. తనకున్న భూమిలో ఎకరానో, రెండు ఎకరాలో ఇస్తానని గ్రంధి ఆఫర్ చేశారు. ఈ రోజుల్లో బెదిరిస్తే బెదిరిపోయే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు. తనకు 60 ఏళ్లని, ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా లేదన్నారు.