వైసీపీలో కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేరిక వాయిదా పడింది. ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ కండువా కప్పుకోవాలని భావించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన బహిరంగంగా పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ కాన్వాయితో చేరికకు తరలి రావాలని పిలుపునిచ్చానని, అది కుదరకపోవడం వల్ల క్షమాపణ అడుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే తన పిలుపునకు ఊహించిన దాని కంటే భారీ స్థాయిలో స్పందన వచ్చినట్టు ఆయన పేర్కొనడం విశేషం.
భారీగా తరలి వెళితే, భద్రతా ఇబ్బందులు తలెత్తుతాయనే కారణంతో తాడేపల్లికి అందరూ వెళ్లే కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు ఆయన వెల్లడించారు. తరలి రావాలని ఆహ్వానించి, ఇప్పుడు వద్దని నిరుత్సాహపరిచినందుకు మరోసారి ఆయన క్షమాపణ కోరారు.
ఈ నెల 15 లేదా 16 తేదీల్లో తానొక్కడే తాడేపల్లి వెళ్లి సీఎం సమక్షంలో వైసీపీ చేరనున్నట్టు ముద్రగడ పద్మనాభం వెల్లడించారు. ఆశీస్సులు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.