అనకాపల్లి సీటు నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పవన్ కళ్యాణ్ బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు అలిగారని, ఎవరి ఫోన్ లు ఆన్సర్ చేయడం లేదని రెండు మూడు రోజులు ముందే వార్తలు బయటకు పొక్కాయి.
వైకాపా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీటిని ఇప్పుడు మరోసారి గట్టిగా నొక్కి చెప్పారు. నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రంధి శ్రీనివాస్ ను కాపులంతా కలిసి ఓడించాలని, అలాంటి వారి వల్ల కాపులకే అవమానం అని, ఎన్ని వందల కోట్లు ఖర్చు చేసినా, వెనక్కు తగ్గకుండా భీమవరంలో మాత్రం జనసేనను గెలిపించాలని అన్నారు.
దీనికి కౌంటర్ గా గ్రంధి శ్రీనివాస్ ఈ రోజు గట్టిగా మాట్లాడారు. పవన్ ను ఎర్రగడ్డ ఆసుపత్రిలో చేర్చాల్సి వుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి చాలా మంచివారని, ఆయన ఎవరినీ ఏ రోజూ దూషించలేదని అన్నారు. పవన్ ఆఖరికి అనకాపల్లి సీటు కూడా అమ్మేసుకోవడం వల్ల నాగబాబు మనస్థాపానికి గురై ఎవరి ఫోన్ లు ఆన్సర్ చేయడం లేదని అన్నారు.
అంటే నాగబాబు అలిగిన సంగతి, ఫోన్ లు ఆన్సర్ చేయడం మానేసిన సంగతి నిజమే అన్నమాట. మెగా ఫ్యాన్స్ లో ఎక్కువ మందికి అందుబాటులో వుండేది నాగబాబే. ఎప్పుడు ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేయాలన్నా నాగబాబు పూనుకోనిదే పని జరగదు. మరి నాగబాబు అలక అన్నది ఫ్యాన్స్ లోకి ఎలాంటి సంకేతాలు ఇస్తుందో?