అంతా అయిపోయింది. భాజపా-జనసేనకు కలిపి 31 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేసారు. ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చేసారు. హమ్మయ్య అనుకున్నారు.. నచ్చినా.. నచ్చకున్నా, తెలుగుదేశం- జనసేన జనాలు. భాజపా కు అసలు జనాలు వుంటే కదా.. కిందా మీదా అయిపోవడానికి. దొరికిందే మహాభాగ్యం. పైగా బలవంతంగా లాక్కుంటున్నది వాళ్లే కనుక, నొప్పి వాళ్లకేమీ లేదు. ఆ తరువాత అంకం మొదలు కావాల్సి వుంది. అదే ఏ సీటు ఎవరికి అన్నది. ఈ మేరకు ఊహాగానాలే తప్ప అధికారికంగా రాలేదు.
ఈ లోగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ రాజమండ్రి టికెట్ రాదని తెలిసి, వైకాపా వైపు చూస్తున్నారని అనుమానం వచ్చింది. అందుకే అతగాడి పేరు ఒక్కటీ నిడదవోలుకు ఖరారు చేసారు. దాంతో అక్కడ తెలుగుదేశంలో గడబిడ మొదలైంది. ఇలాంటి గడబిడలు ఎక్కడికక్కడే వున్నాయి. ఇవన్నీ ఎలా చల్లార్చాలో, ఎలా టికెట్ ల జాబితా ప్రకటించాలో తెలియడం లేదు. అందుకే అలా వుండిపోయింది ఆ వ్యవహారం.
ఈ లోగా భాజపా మరో సీటు అడుగుతోందని, కాదూ అంటే తాడేపల్లి గూడెం తమకే ఇవ్వాలని పట్టుబడుతోందని వార్తలు వచ్చాయి. దాంతో అక్కడ తెలుగుదేశం, జనసేన వర్గాలు కలవరపడడం మొదలైంది. విశాఖ నార్త్ నుంచి భాజపా విష్ణుకుమార్ రాజు ఫిక్స్ అనుకుంది. కానీ ఆ సీటు తనకు కావాలంటున్నారు బాలయ్య అల్లుడు భరత్. తన తోడల్లుడిని తనతో పాటు సభలో కూర్చోనివ్వడం లోకేష్ ఇష్టపడతారా అన్నది అనుమానం. ఎంతయినా ఆ తండ్రికి కొడుకేగా.
ఇలా ఎక్కడిక్కడ గబబిడలే. వైకాపా సీట్ల ప్రకటన దాదాపు దగ్గరకు వచ్చేసింది అని వార్తలు వస్తున్నాయి. కానీ సమస్య ఏమిటంటే జగన్ ఇప్పుడు గతంలో మాదిరిగా కాదు, టికెట్ ఇచ్చిన గంటలో మార్చేస్తున్నారు. అందువల్ల తేదేపా- జనసేన- భాజపా లిస్ట్ వచ్చిన తరువాత మళ్లీ తన జాబితా మార్చరు అన్న అనుమానం లేదు. అలా అని ఎంత కాలం వేచి వుంటారు.
చిలకలూరి పేట సభ నిర్విఘ్నంగా జరిగిపోవాలి. అందుకే గడబిడ ఎందుకని, 14నే జాబితా ప్రకటిస్తా అని చంద్రబాబు చెప్పేసారు. వన్స్ జాబితా వచ్చాక గడబిడలు ఎలాగూ వుంటాయి. అప్పుడు ఇక బుజ్జగింపులు, సామ, దాన, బేధోపాయాలు వుంటాయి. డబ్బులకు కొందరు లొంగుతారు. పదవుల ఆశకు మరి కొందరు లొంగుతారు. కానీ ఎక్కడిక్కడ గొడవల కారణంగా ఓట్ల బదిలీలో మాత్రం తేడా అన్నది తప్పదు.