ఏపీ బీజేపీ దగ్గుబాటి పురందేశ్వరి ముందు చూపుతో, సొంత పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలకు భారీ షాక్ ఇవ్వడానికి పక్కా స్కెచ్ వేశారని తెలిసింది. పురందేశ్వరి కోణంలో వ్యూహమైతే, ఆమె అంటే గిట్టని వారి దృష్టిలో వెన్నుపోటు పొడవడానికి ఆమె తన మార్క్ రాజకీయాన్ని నడుపుతున్నట్టు తెలిసింది.
బీజేపీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… ఆ పార్టీలో కీలక నేతలైన మాజీ మంత్రి సుజనా చౌదరి, సత్యకుమార్‌కు ఎంపీ టికెట్లు దక్కకుండా పురందేశ్వరి పక్కా ప్రణాళికను అమలు చేస్తున్నారు. టీడీపీతో బీజేపీ పొత్తు నేపథ్యంలో ఆరు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆశావహుల జాబితాను ముందు పెట్టుకుని, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇవ్వొచ్చో పరిశీలిస్తున్నారు.
మాజీ మంత్రి సుజనా చౌదరి విజయవాడ, అలాగే సత్యకుమార్ హిందూపురం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేతలిద్దరికీ బీజేపీ అధిష్టానం వద్ద మంచి పలుకుబడి ఉంది. అయితే ఎలాగైనా వీళ్లిద్దరికి చెక్ పెట్టాలని మేడమ్ పురందేశ్వరి మాస్టర్ ప్లాన్ వేసినట్టు బీజేపీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీళ్లిద్దరినీ ఎంపీలుగా పోటీ చేయకుండా అడ్డుకోవాల్సిన అవసరం పురందేశ్వరికి ఏముందనే ప్రశ్నకు షాకింగ్ ఆన్సర్ వచ్చింది.
కేంద్రంలో మంత్రి పదవికి తనకు పోటీ అవుతారనే ఉద్దేశంతో.. అసలు వాళ్లకు ఎంపీ టికెట్లే ఇవ్వకపోతే సరిపోతుంది కదా అని పురందేశ్వరి ఎత్తుగడ వేసినట్టు సుజనా, సత్యకుమార్ అనుచరులు చెప్పడం గమనార్హం. మరీ ముఖ్యంగా తన సామాజిక వర్గానికే చెందిన సుజనా చౌదరి పోటీ అవుతారని, అలాగే సత్యకుమార్‌కు కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి వుండడంతో గెలిస్తే తప్పక కేబినెట్లో చోటు కల్పిస్తారనే భయంతో పురందేశ్వరి మొగ్గ దశలోనే తుంచేయాలని వ్యూహం రచించారని సమాచారం.
ప్రస్తుతం బీజేపీలో సత్యకుమార్, సుజనాచౌదరిలకు టికెట్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చంద్రబాబుకు మించిపోయేలా మా మేడమ్ వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.