నాకు సీటు ఇవ్వ‌క‌పోతే… బీజేపీ చౌద‌రి హెచ్చ‌రిక‌!

టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీలో టికెట్ల చిచ్చు ర‌గిలింది. ఏలూరు ఎంపీ టికెట్‌పై ర‌గ‌డ జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌హారం బీజేపీకి త‌ల నొప్పిగా మారింది. ఏలూరు లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన…

టీడీపీతో పొత్తు కుదుర్చుకున్న బీజేపీలో టికెట్ల చిచ్చు ర‌గిలింది. ఏలూరు ఎంపీ టికెట్‌పై ర‌గ‌డ జ‌రుగుతోంది. ఈ వ్య‌వ‌హారం బీజేపీకి త‌ల నొప్పిగా మారింది. ఏలూరు లోక్‌స‌భ స్థానం నుంచి బీజేపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గార‌పాటి సీతారామాంజ‌నేయ‌ చౌద‌రి పోటీ చేయాల‌ని ఆయ‌న ప‌ని చేసుకుంటున్నారు. గ‌త ప‌దేళ్లుగా ఏలూరు పార్ల‌మెంట్ ప‌రిధిలో పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఆయ‌న శ్ర‌మిస్తున్నారు.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఏలూరులో ప్ర‌చారం కూడా నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పొత్తులో భాగంగా ఏలూరు ఎంపీ సీటును కేంద్ర మాజీ మంత్రి సుజ‌నాచౌద‌రికి ఇస్తార‌నే ప్ర‌చారం ఊపందుకుంది. గ‌తంలో సుజ‌నాచౌద‌రి కేంద్ర మంత్రిగా ప‌ని చేయ‌డం, బీజేపీ పెద్ద‌ల‌తో పాటు చంద్ర‌బాబుతో స‌న్నిహిత సంబంధాల కార‌ణంగా ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌నే అనుమానం గార‌పాటి చౌద‌రిలో వుంది. ఈ ప్ర‌చారంపై ఆయ‌న తీవ‌ర అస‌హ‌నంగా ఉన్నారు.

త‌న‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే, ఖ‌చ్చితంగా పోటీలో వుంటాన‌ని ఇప్ప‌టికే బీజేపీ పెద్ద‌ల‌కు ఆయ‌న స‌మాచారం పంపారు. టికెట్ ప్ర‌క‌టించ‌డానికే ముందే ఆయ‌న త‌న వైఖ‌రిని బ‌హిరంగంగా స్ప‌ష్టం చేయ‌డానికి ఈ నెల 15న ఏలూరులో ఆత్మీయ స‌మావేశం నిర్వ‌హించనున్నారు. ఈ మేర‌కు ఏలూరు పార్ల‌మెంట్ ప‌రిధిలోని బీజేపీ శ్రేణుల‌కు ఆహ్వానం పంపారు.

ఒక‌వేళ ఏలూరు టికెట్ త‌న‌కు కాకుండా సుజ‌నాచౌద‌రికే ఇస్తే, ప్ర‌త్యామ్నాయం వెతుక్కోడానికైనా సిద్ధ‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌నున్న‌ట్టు తెలిసింది. అయితే ఏలూరు విష‌యంలో సాగుతున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని కొంద‌రు బీజేపీ పెద్ద‌లు ఆయ‌న‌తో అన్న‌ట్టుగా తెలిసింది. తొంద‌ర ప‌డొద్ద‌ని, టికెట్ లేద‌ని తెలిసిన త‌ర్వాతే ఏదైనా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న‌కు సూచించార‌ని స‌మాచారం.