ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి.
1. పాలిటిక్స్‌లో శాశ్వత మిత్రులు, శత్రువులుండరు. అవసరాలే వుంటాయి. గత ఎన్నికల్లో మోదీని నాన్‌స్టాప్‌గా తిట్టిన చంద్రబాబు, ఈ సారి ఢిల్లీలో సాగిలపడి, ప్రదక్షిణలు చేసి పొర్లు దండాలతో పొత్తు కుదుర్చుకున్నారు. పవన్‌కి ఇవ్వాల్సిన సీట్లని బీజేపీకి పంచి తాంబూలాలు ఇచ్చేశాను, తన్నుకుచావండి అన్నాడు.
2. సినిమాల్లో నాగేశ్వరరావు, శోభన్‌బాబు త్యాగ హీరోలు. మంచి మనసులులో సావిత్రిని ఏఎన్ఆర్ త్యాగం చేస్తాడు. గోరింటాకులో శోభన్ తన ప్రేమను వదులుకుంటాడు. పవన్‌కల్యాణ్ ఈ రకం పాత్రలెప్పుడూ వేయలేదు. ఆ లోటును తీర్చుకోడానికి రాజకీయాల్లో త్యాగరాజు అవతారం ఎత్తాడు. చంద్రబాబు గెలుపు, జగన్ ఓటమి లక్ష్యంగా త్యాగాల మీద త్యాగాలు. గత ఎన్నికల్లో తనని జగన్ చిత్తుచిత్తుగా ఓడించాడు కాబట్టి కోపం వుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి బాబు మీద ప్రేమ ఎందుకు? విభజిత ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఆయన ఏం అద్భుతాలు చేశారు? ప్రజల మేలుకోరే లక్ష్యమే పవన్‌కి వుంటే, ఆ ఐదేళ్లు సినిమాలు చేసుకుంటూ ఎందుకు నిద్రపోయాడు?
3. చంద్రబాబు లక్ష్యం ఈ సారి తాను ముఖ్యమంత్రి కావడం, పర్మినెంట్‌గా లోకేశ్ ముఖ్యమంత్రిగా వుండాలనుకోవడం. కళ్లు కనపడని దృతరాష్ట్రుడికే అపార పుత్ర ప్రేమ వుంటే, ఒళ్లంతా కళ్లతో జీవించే చంద్రబాబుకి ఎంత వుండాలి? పవన్ సినిమాల్లో హీరో గానీ, చంద్రబాబు దృష్టిలో కమెడియన్. అందుకని గేమ్ మొత్తం చేతిలోకి తీసుకున్నాడు.
కాపులకి పవన్ అన్యాయం చేసినా, పవన్‌ని నమ్మడం తప్ప కాపులకి వేరే దారి లేదు. కాపులు టీడీపీ వైపు వుండేలా కట్టడి చేయడం , జగన్ వ్యతిరేక ఓటు చీలకుండా వుండడం.. ఇది జరగాలంటే పవన్ తన వెంట వుండాలి. ఇచ్చిన సీట్లు కిక్కురుమనకుండా తీసుకోవాలి. తమకి బలహీనంగా వున్న సీట్లు , లేదా తమ మనుషులే జనసేన ముసుగులో పోటీ చేయడం.
చంద్రబాబు నూరుశాతం రాజకీయ నాయకుడు. ఎందుకంటే నమ్మించడం, నమ్మిన వాళ్లని ముంచేయడం ఈ విద్యని 40 ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాడు. ఎన్టీఆర్, దగ్గుబాటి, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, ఉపేంద్ర, నల్లపురెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్ ఇలా పాతిక పేర్లు చెప్పొచ్చు. ఇప్పుడు పవన్ వంతు.
చంద్రబాబు తెలివి, లౌక్యం, అదృష్టం ఏమంటే బలమైన మీడియా ఆయన వెంట వుంది. పిల్లిని చూపించి పులిగా భ్రమింప చేయడం. గ్రాఫిక్స్ రాక ముందే గ్రాఫిక్స్ న్యూస్‌ని కనిపెట్టింది బాబు మీడియానే. వైశ్రాయ్‌లో అర డజను మంది కూడా లేనప్పుడు 120 మంది పైగా ఉన్నారని గ్రాఫిక్స్ న్యూస్ రాసిందెవరో అందరికీ తెలుసు.
జగన్ సభల్ని గ్రాఫిక్స్ అంటున్నారు. సోషల్ మీడియా లేకపోతే జనం దాన్ని నమ్మేవాళ్లు. సాక్షి పత్రిక లేకపోతే జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. చిరంజీవి పరాజయానికి కారణం మీడియా అండలేకపోవడం. పవన్ వరుస తప్పులకి కారణం ఆయనకంటూ సొంత మీడియా లేకపోవడమే.
4. ఈ మొత్తం ఆటలో నష్టపోయింది కాపులు. తమ సామాజిక వర్గం ముఖ్యమంత్రిని ఇప్పట్లో చూడలేరు. కనీసం ఇంకో దశాబ్దం ఎదురు చూడాల్సిందే.
మరి గెలిచింది బీజేపీ. జీరో స్థానం నుంచి ఒక్క సీటు వచ్చినా అది గెలుపే. ఓడినా గెలిచినా సేఫ్ గేమ్ ఆడుతున్నాననే అమాయకత్వంలో ఉన్నదెవరంటే చంద్రబాబు. గెలిస్తే ఇక్కడ అధికారం, అక్కడ కేంద్రం అండ. ఓడితే జగన్ దాడి నుంచి రక్షణగా బీజేపీ.
అయితే బీజేపీ ప్లాన్ ఏమంటే మహారాష్ట్రలా ఏపీ రాజకీయాల్ని అస్థిరపరిచి గుప్పెట్లోకి తీసుకోవడం. పార్టీలని చీల్చడంలో బాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన పార్టీ బీజేపీ. పవన్ సాయంతో టీడీపీని చీల్చడానికి ట్రైలరే ఈ పొత్తు.
రాజకీయాల్లో ప్రతి ఒక్కరికీ ఒక టైమ్ వుంటుంది. బహుశా చంద్రబాబు వాచి చెడిపోయినట్టుంది. వచ్చేదంతా అకాలమే.