కందుల దుర్గేష్‌ను ఓడించేందుకు టీడీపీ పంతం!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు, నిడ‌ద‌వోలు కూట‌మి అభ్య‌ర్థి కందుల దుర్గేష్‌ను ఓడించేందుకు టీడీపీ పంతం ప‌ట్టింది. రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డంపై నిడ‌ద‌వోలు టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా…

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా జ‌న‌సేన అధ్య‌క్షుడు, నిడ‌ద‌వోలు కూట‌మి అభ్య‌ర్థి కందుల దుర్గేష్‌ను ఓడించేందుకు టీడీపీ పంతం ప‌ట్టింది. రాజ‌మండ్రి రూర‌ల్ నుంచి త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి రావ‌డంపై నిడ‌ద‌వోలు టీడీపీ నేత‌లు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నారు. క‌నీసం త‌మ‌తో చ‌ర్చించ‌కుండానే నిడ‌ద‌వోలు నుంచి కూట‌మి త‌ర‌పున జ‌న‌సేన నాయ‌కుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంపై టీడీపీ నేత‌లు గుర్రుగా ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో త‌న‌ను అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించిన త‌ర్వాత మొద‌టిసారిగా నిడ‌ద‌వోలుకు వెళ్లిన కందుల దుర్గేష్‌కు టీడీపీ నుంచి ఎలాంటి ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. నిడ‌ద‌వోలు టీడీపీ ఇన్‌చార్జ్ బూరుగుప‌ల్లి శేషరావు మ‌ద్ద‌తు కోరేందుకు ఆయ‌న ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లో వున్న‌ప్ప‌టికీ లేర‌ని చెప్ప‌డంతో దుర్గేష్ తీవ్ర నిరాశ‌తో వెనుదిరిగిన‌ట్టు జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. రాజ‌మండ్రి రూర‌ల్ సీటును దుర్గేష్ ఆశించారు.

కొన్నేళ్లుగా అక్క‌డ ఆయ‌న ప‌ని చేసుకుంటున్నారు. అయితే సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రిని కాద‌ని, జ‌న‌సేన‌కు ఇవ్వ‌లేమ‌ని చంద్ర‌బాబు తేల్చి చెప్పారు. మ‌రోవైపు ఈ సారి టికెట్ మీకే, ప‌ని చేసుకోవాల‌ని త‌న‌కు ప‌వ‌న్ చెప్పార‌ని, అందుకు త‌గ్గ‌ట్టు ప్ర‌చార ఏర్పాట్లు కూడా చేసుకున్న కందుల దుర్గేష్ తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లారు. దుర్గేష్‌ను కాద‌ని బుచ్చ‌య్య‌కు టికెట్ ఇస్తే తాము ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో టీడీపీకి ఓట్లు వేయ‌ర‌ని కాపు నాయ‌కులు హెచ్చ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ చంద్ర‌బాబు లెక్క చేయ‌లేదు. చివ‌రికి నిడ‌ద‌వోలుకు కందుల దుర్గేష్ వెళ్లాల్సి వ‌చ్చింది. అక్క‌డ టీడీపీ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే బూరుగుప‌ల్లి శేష‌రావు, కె.స‌త్యానారాయ‌ణ తీవ్రంగా జ‌న‌సేన‌ను వ్య‌తిరేకిస్తున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ కందుల దుర్గేష్‌కు స‌హ‌క‌రించేది లేద‌ని టీడీపీ నేత‌లు తేల్చి చెప్పారు.

దుర్గేష్ కాపు సామాజిక వ‌ర్గం కాగా, టికెట్ ఆశిస్తున్న శేష‌రావు, స‌త్య‌నారాయ‌ణ క‌మ్మ సామాజిక వ‌ర్గం. రాజ‌మండ్రిలో బాబు సామాజిక వ‌ర్గం దెబ్బ‌కు నిడ‌ద‌వోలుకు పారిపోయి వ‌చ్చిన దుర్గేష్‌కు, అక్క‌డ కూడా వారి నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని కాపులు వాపోతున్నారు. టీడీపీ స‌హ‌క‌రించ‌క‌పోతే దుర్గేష్ ఘోర ప‌రాజయాన్ని మూట‌క‌ట్టుకోనున్నారు.