ఏ మాటకామాట చెప్పుకోవాలంటే రెండు నెలల క్రితం వరకూ వైసీపీకి రాజకీయంగా కౌంట్‌డౌన్ మొదలైందని అనుకున్నారు. ఇందులో స్వపక్షం, విపక్షం అనే తేడా లేదు. కాలం మ్యాజిక్ చేస్తోంది. తీరా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది మరీ ముఖ్యంగా టీడీపీ రోజురోజుకూ తేలిపోతోంది. వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతూ విజయం వైపు పయనిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇదే సందర్భంలో జనసేన, బీజేపీలతో పొత్తు పెట్టుకున్న టీడీపీ పని అయిపోతోందన్న చర్చ విస్తృతంగా సాగుతోంది.
ఎన్నికల సమరానికి సన్నద్ధమవుతున్న కీలక తరుణంలో అధికార పార్టీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారం కోసం ప్రధానంగా పోటీ పడుతున్నది టీడీపీనే కాబట్టి, ఆ పార్టీ కేంద్రంగానే మాట్లాడుకోవాల్సి వస్తోంది. చంద్రబాబు భయమే ఆ పార్టీ పుట్టి ముంచనుంది. మనిషికి భయానికి మించిన శత్రువు మరొకటి వుండదు.
సహజంగా చంద్రబాబు భయస్తుడు. అధికారం చేతిలో వుంటే దబాయిస్తుంటారే తప్ప, ప్రతిపక్ష నేతగా బాబు అంత పిరికి నాయకుడు మరొకరు వుండరు. జనసేనతో పొత్తు పెట్టుకుని మొదటి తప్పు చేశారు. దాని కొనసాగింపుగా బీజేపీతో కూడా అవగాహన కుదుర్చుకుని తన నెత్తిన తానే భస్మాసుర హస్తాన్ని పెట్టుకున్నట్టైంది. చంద్రబాబుకు కాలం కలిసి రావడం లేదనేందుకు ఉదాహరణ.. బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న వేళా విశేషమేమో తెలియదు కానీ, ఆ మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. అర్ధరాత్రి నుంచి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమల్లోకి వస్తుందని మోదీ సర్కార్ వెల్లడించింది.
మరోవైపు మంగళవారం కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటనలో తాము అధికారంలోకి వస్తే ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్‌ను తొలగిస్తామని ప్రకటించారు. ఇవన్నీ ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. బీజేపీ అంటే భయం, తీవ్రమైన కోపం.. అంతిమంగా టీడీపీపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
వైసీపీకి ముస్లిం మైనార్టీలు మొదటి నుంచి మద్దతుగా నిలుస్తున్న మాట నిజం. అయితే వారిలో కూడా 30 శాతం వరకు ఇటీవల కాలంలో టీడీపీ వైపు ఉన్నారు. సీఏఏ చట్టం అమల్లోకి రాక మునుపు మాట. ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా విచారిస్తే… ఏ ఒక్క ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ కూడా కూటమిలోని పార్టీలకు ఓటు వేసే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీకి ఇది చావు దెబ్బ. జనసేన, బీజేపీలకు పోగొట్టుకోడానికి ఏమీ లేదు. కాబట్టి ఆ పార్టీలకు ఎలాంటి ఆందోళన వుండదు. బీజేపీతో పొత్తు వల్ల ప్రయోజనం ఏంటో చెప్పమంటే.. వెంటనే ఇదీ అని చెప్పడానికి టీడీపీ వద్ద ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు.
కానీ బీజేపీతో పొత్తు వల్ల టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోనుంది. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేసిన పార్టీగా బీజేపీపై రాష్ట్ర ప్రజలు రగిలిపోతున్నారు. వెనుకబడిన జిల్లాలకు ప్రతి ఏడాది ఇవ్వాల్సిన ప్రత్యేక ప్యాకేజీ నిధులకు దిక్కేలేదు. అలాగే పోలవరం జాతీయ ప్రాజెక్టుకు సరైన రీతిలో నిధులు ఇవ్వకుండా, రాష్ట్ర భవిష్యత్‌తో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటోందన్న ఆగ్రహం అందరిలో వుంది. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కుగా ఒక సెంటిమెంట్‌గా భావించే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీని జనం క్షమిస్తారని టీడీపీ అనుకుంటోంది? ఆ నెగెటివ్ ఎఫెక్ట్‌ను అంతిమంగా తాను భరించాల్సి వస్తుందని టీడీపీ ఎందుకు ఆలోచించడం లేదో అర్థం కాదు.
విశాఖకు రైల్వేజోన్, అన్నింటికి మించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపకు ఉక్కు పరిశ్రమ…ఇలా ఒకటా, రెండా? బీజేపీని దోషిగా నిలిపేందుకు చాలా అంశాలే ఉన్నాయి. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తమపై కేసుల కారణంగా, కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి భయపడొచ్చు. కానీ ఏపీ ప్రజలకు ఆ భయం ఉండదు.
ప్రజల్తో తీవ్ర వ్యతిరేకత ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు చేసిన చరిత్రాత్మక తప్పిదమని చెప్పక తప్పదు. కురుక్షేత్ర సమయంలో దుష్టుడి వైపు ఉన్న కారణంగా భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు లాంటి ఉత్తమ యోధులు కూడా అంతిమంగా పాండవుల చేతల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని సమర్థించుకునేందుకు చంద్రబాబు ఎన్ని కథలైనా చెప్పొచ్చు. జనం అమాయకులు కారనే విషయాన్ని ఆయన మరిచిపోకుంటే చాలు.
ఇక బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడం టీడీపీ పాలిట ఆత్మహత్యా సదృశ్యమే. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇన్ని సీట్లు ఇస్తే, ప్రజలు ఆదరిస్తారని ఎలా అనుకుంటున్నారు? అలాగే బీజేపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో కనీసం తన పార్టీ శ్రేణులైనా ఓట్లు వేస్తారనే నమ్మకం చంద్రబాబుకు వుందా? ఇవన్నీ అప్పనంగా తన ప్రత్యర్థి పార్టీ ఖాతాలో చేజేతులా వేసినట్టు కాదా? ఈ మాత్రం ఆలోచన బాబుకు ఎందుకు లేకపోయిందనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఇక జనసేన విషయానికి వస్తే.. ఇదో విచిత్రమైన పరిస్థితి. టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన మొదట్లో రెండు పార్టీల్లోనూ ఊపు కనిపించింది. ఇదే సందర్భంలో అధికార పక్షంలో భయం కనపడింది. ఒక దశలో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం పక్కా అనే వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా నెలకుంది. అయితే పొత్తు ప్రకటన చేయడంలో ఉన్న శ్రద్ధ, కలిసి పని చేయడంలో కొరవడింది.
రెండు పార్టీలు కలిస్తే అధికారం వస్తుందనే ప్రచారం కూడా ఆ పార్టీలకు రాజకీయంగా కొత్త సమస్యలు తెచ్చింది. దీంతో ఇరు పార్టీల్లోనూ ఆశావహులు క్రమంగా పెరుగుతూ వచ్చారు. జనసేనకు కనీసం 40 సీట్లకు తక్కువ కాకుండా సీట్లు ఇస్తారనే ప్రచారం విస్తృతంగా సాగింది. పవన్‌కల్యాణ్ ప్రసంగాలు కూడా అదే అభిప్రాయాన్ని బలంగా కలిగించాయి. దీంతో జనసేన శ్రేణులు తాము 40 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామనే భ్రమల్లో ఊరేగారు.
చివరికి 24, తాజాగా 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లలో పోటీ అనేసరికి జనసేన కార్యకర్తలు, నాయకులు పూర్తిగా డీలా పడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్న తమ నాయకుడిని అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబునాయుడు, బీజేపీ నేతలు వంచించారనే భావన జనసేన శ్రేణుల్లో బలంగా వుంది. మరీ ముఖ్యంగా అరశాతం ఓట్లు బ్యాంక్ కలిగిన బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు ఇచ్చి, ఆరున్నర శాతం ఓటు బ్యాంక్ ఉన్న తమకు కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ సీట్లే ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు, నాయకులు రగిలిపోతున్నారు.
తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశారని, క్షతగాత్రుల్లా జనసేన శ్రేణులు మిత్రపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీలకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే అధికారంలో షేర్ ఇస్తారని, పవన్‌ను ముఖ్యమంత్రిగా చూడొచ్చనే తమ ఆకాంక్షపై చంద్రబాబునాయుడు, లోకేశ్ నీళ్లు చల్లడాన్ని జనసైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో జనసేనతో పొత్తు టీడీపీకి నష్టమే తప్ప, పెద్దగా ప్రయోజనం వుండదు.
ఉభయగోదావరి జిల్లాల్లో కాపుల ఓట్ల కోసమే జనసేనతో చంద్రబాబు పొత్తు కుదుర్చకున్నారనేది వాస్తవం. రాజమండ్రి రూరల్ సీటును బలవంతంగా కందుల దుర్గేష్ నుంచి తమ సామాజిక వర్గానికి చెందిన సిటింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోసం లాక్కున్నారని కాపులు బహిరంగంగానే మండిపడుతున్నారు. ఇలా అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ ఎంత చెప్పినా ఓట్ల బదిలీ ఆశించిన స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు.
మరీ ముఖ్యంగా తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్‌కల్యాణ్ తన పార్టీని తానే కించపరుచుకునేలా మాట్లాడ్డం కూడా ఆయన్ను అభిమానించే వారికి అసలు నచ్చలేదు. ఆ బహిరంగ సభతో చాలా మంది ఆయనకు దూరమయ్యారు. పవన్‌కల్యాణ్ వైపు కాపులు నిలబడకుంటా, ఇక తనకు మద్దతుగా వుంటారని చంద్రబాబు ఎలా అనుకుంటారు? ఇక్కడో ఇంకో నష్టం టీడీపీకి తప్పదు. కాపుల పార్టీగా గుర్తింపు పొందిన జనసేనతో పొత్తు వల్ల టీడీపీకి ముఖ్యంగా బీసీలు, దళితులు దూరమయ్యారు.
ఉభయగోదావరి జిల్లాల్లో కులాల వైరం గురించి అందరికీ తెలిసిందే. జనసేనతో టీడీపీ అంటకాగడంతో టీడీపీకి అండగా నిలిచే కులాలు కూడా దూరమయ్యే ప్రమాదం పొంచి వుంది. ఇదే టీడీపీ ఒంటరిగా పోటీ చేసి వుంటే, ఈ రకమైన కష్టాలు వచ్చేవి కావు. చేజేతుగా ఓటమిని కొని తెచ్చుకుంటున్నామేమో అనే అనుమానం కొంత కాలంగా టీడీపీ నేతలను వెంటాడుతోంది. మరోవైపు వైసీపీకి పెరుగుతున్న గ్రాఫ్‌ను చూస్తే.. వ్యతిరేకత నుంచి కోలుకుని విజయబాటలో నడుస్తున్న భావన ప్రత్యర్థుల్లో కూడా కలుగుతోంది. వైసీపీకి కాలం కలిసి వస్తున్నట్టే కనిపిస్తోంది.
ఏ రకంగా చూసినా టీడీపీకి రాజకీయంగా నష్టం కలిగించే వాతావరణం కళ్ల ముందు కదలాడుతోంది. సంక్షేమ పథకాలను అందించడంలో వైఎస్ జగన్ సర్కార్‌ను మించింది మరొకటి దేశంలోనే లేదు. ఇప్పుడు కూటమి ఎన్ని హామీలిచ్చినా, నమ్మే పరిస్థితి లేదు. వైఎస్ జగన్‌ను ఎదుర్కోడానికి జనసేన, బీజేపీలతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అవే ఆయనకు గుదిబండగా మారాయి. ఈ పార్టీలు చాలవన్నట్టు ఎల్లో మీడియా బాబుకు మేలు చేస్తున్నామనే భ్రమలో తన వంతు కీడు చేస్తోంది. ఎల్లో మీడియా చంద్రబాబుకు చేస్తున్న ద్రోహం గురించి మరో కథనంలో చర్చించుకుందాం. జగన్‌ను ఒక్కడిగా చేసి టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా.. అంతా మూకుమ్మడి దాడికి పాల్పడుతున్నారనే సానుభూతి వ్యక్తమవుతోంది.
కాలం కలిసి రాకపోతే తాడు పామై కరుస్తుందనే సామెత చందాన…బాబు రాజకీయ పరిస్థితి వుందనే చర్చకు తెరలేచింది. ఎందుకోగానీ, టీడీపీ ఆరిపోయే దీపమనే భావన, ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ల మనసుల్లో కూడా ఏదో తెలియని బాధ.