రాజకీయం అంటే అంతే మరి. లాభం వుందనుకుంటే కౌగిలించుకుని ముద్దాడుతారు. నష్టమనుకుంటే ఛీకొట్టి, అంటరాని వాళ్లగా చూస్తారు. రాజకీయంగా ప్రయోజనం వుంటుందని భావిస్తే… అబ్బో వీరుడు, శూరుడని తెగ పొగిడేస్తారు. లేదంటే దుర్మార్గుడు, రాక్షసుడని తిట్టడానికి వెనుకాడరు. రాజకీయమనే కాదు, వ్యవస్థే ప్రయోజనాలపై నడుస్తోంది. లాభం వుందనుకుంటే తప్ప పలకరించరు. ఈ వాస్తవాన్ని గ్రహించి నడుచునే వారే సుఖంగా వుంటారు. లేదంటే మానసిక క్షోభ తప్పదు.
ఇప్పుడు జనసేన శ్రేణులు క్షోభను అనుభవిస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ను టీడీపీ కార్యకర్తలు, నాయకులు బండబూతులు తిడుతున్నారు. ముఖ్యంగా బీజేపీతో బలవంతంగా పొత్తు కుదిర్చి, రాజకీయంగా టీడీపీకి తీవ్రంగా నష్టం కలిగించడానికి పవనే కారణమని ఆ పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రాకపోతే, అందుకు ప్రధాన బాధ్యుడు పవన్‌కల్యాణ్, ఆ తర్వాత బీజేపీనే వహించాల్సి వుంటుందని టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.
పొత్తు కారణంగా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. మరోవైపు జనసేనతో పొత్తు వల్ల మరో 21 నియోజకవర్గాల్లో టీడీపీ నాయకత్వం ప్రశ్నార్థకమవుతోందనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో వుంది. బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు అంటే, అలాగైతే తాను బయటికి వెళ్లిపోతానని పవన్ బెదిరించడం వల్లే అయిష్టంగా తమ నాయకుడు ఢిల్లీ వెళ్లాల్సి వచ్చిందని టీడీపీ నాయకుల వాదన.
ఏ రకంగా చూసినా బీజేపీతో పొత్తు వల్ల నష్టమనే అభిప్రాయం టీడీపీ శ్రేణుల్లో వుంది. పవన్‌కల్యాణ్ ఒత్తిడి కారణంగానే బీజేపీతో అంటకాగాల్సి వస్తోందనే ఆవేదన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బీజేపీ మాట ఎత్తితే చాటు, ముందుగా పవన్‌పై బూతులు తిట్టే పరిస్థితి. ఈ పరిణామాల్ని జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీతో పొత్తు కుదర్చడానికి పవన్‌కల్యాణ్ బీజేపీ పెద్దలతో తిట్టించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు వీళ్లేమో తమ నాయకుడిని తిట్టడం భావ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.