ఇలా చెప్పడం ‘దేశా’నికే నష్టం

ఈ కాలంలో రాజకీయ ప్రచార సభలకు ఏ ఒక్కరూ కూడా అభిమానంతో వెళ్లడం లేదు. అభిమానం వున్నవారిని సైతం పిలిచి, డబ్బులు, మందు, తిండి, వాహనం ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం.…

ఈ కాలంలో రాజకీయ ప్రచార సభలకు ఏ ఒక్కరూ కూడా అభిమానంతో వెళ్లడం లేదు. అభిమానం వున్నవారిని సైతం పిలిచి, డబ్బులు, మందు, తిండి, వాహనం ఇచ్చి మరీ తీసుకెళ్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. ఎట్ లీస్ట్ 500 ఇస్తే తప్ప ఎవ్వరూ రావడం లేదు. ఆ పై మిగిలినవి అదనం. అది తెలుగుదేశం సభ అయినా, వైకాపా సభ అయినా అదే లెక్క. కార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి.  సభ పెట్టిన ప్రాంతంలో రాజకీయ పార్టీ ని నమ్ముకున్న పెద్దోళ్లు తలా కొన్ని భరించడం వల్ల. తాడేపల్లిగూడెం సభకు ఉత్తరాంధ్ర నుంచి విజయవాడ వరకు ఎవరు ఎన్ని కార్లు పెట్టకుండానే జరిగిందా.

కానీ కుల కంపుతో కొట్టుకుంటున్న ఎల్లో మీడియా, వెయ్యేసి రూపాయిలు ఇచ్చి వైకాపా సభలకు జనాల్ని తోలుకు వస్తున్నారని వార్తలు రాస్తోంది. అక్కడికి తేదేపా సభలకు అస్సలు డబ్బులు ఇవ్వకుండానే జనం వస్తున్నట్లు. చిలకలూరిపేట సభలకు డబ్బులు ఇవ్వడం మానేయండి, కార్లు పెట్టడం మానేయండి. ఎక్కడి నుంచి ఎంత మంది వస్తారో తెలుస్తుంది.

వైజాగ్‌లో తన సభలకు ఎంపీ ఎంవివి సత్యనారాయణ మనిషికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారని రాసుకువచ్చారు. కానీ ఇలా చేయడం దేశం పార్టీకే ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ల సభలకు రమ్మన్నా వెయ్యి ఇవ్వమని డిమాండ్ చేస్తారు. ఇప్పటి దాకా వున్న రేటు మనిషికి అయిదు వందలే. వైకాపా ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తోందని చెప్పడం ఎల్లో మీడియా ఉద్దేశం కావచ్చు. కానీ దాని వల్ల తేదేపా లోకల్ జనాలను పోగు చేయడం కష్టం అవుతుంది. తమకు కూడా వెయ్యి ఇవ్వాల్సిందే అని కూర్చుంటారు.

పైగా రాను రాను నిత్యం వీళ్లకు, వాళ్లకు కూడా జనాలు కావాల్సి వుంటుంది. ఎవరు ఎక్కువ ఇస్తే అటు వెళ్తారు. పత్రికల్లో రాసుకోవడమే తప్ప, జనాలు పక్కా కమర్షియల్ గా మారిపోయారు. బైక్ కు పెట్రోలు కొట్టించి, తిండికి, మందుకి డబ్బులు ఇస్తేనే కదులుతున్నారు. బస్ పెడితే జనం ఆసక్తి కనబర్చడం లేదు. కారు అంటే సై అంటున్నారు. ఈ నెల రోజుల పాటు కనీసం ఓ పాతిక వేలు సొమ్ము చేసుకోవాలి అని ప్రచారాలకు వెళ్లే జనం డిసైడ్ అయిపోయి వున్నారు.

ఇప్పుడు ఇంత ఇస్తున్నారు, అంత ఇస్తున్నారు అని లెక్కలు బయటపెడితే, అంతా ఇచ్చే వరకు ఎవ్వరూ కదలరు. అధికారంలో వున్న వైకాపా ఎంత ఖర్చు చేస్తే, అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం కూడా అంతకు అంతా ఖర్చు చేయాల్సి వుంటుంది.