జనసేన పార్టీపై సొంత పార్టీలోనే రోజురోజుకూ ఆదరణ కొరవడుతోంది. ఇక ఈ పార్టీని నమ్ముకుని వుండడం వృథా అనే అభిప్రాయం బలపడుతోంది. జనసేన కోసం పని చేయడం, ఆలోచించడం అంటే సమయాన్ని, డబ్బు అవనసరంగా ఖర్చు చేయడమే అనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఒక్కొక్కరుగా మౌనంగా జనసేన నుంచి తప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇంత కాలం జనసేనకు బాగా పని చేసి, విలువైన సమయాన్ని, డబ్బు నష్టపోయిన వారు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించడానికి సోషల్ మీడియాను వేదికగా ఎంచుకోవడం గమనార్హం. సృజనాత్మక సెటైర్స్తో జనసేన పరువు తీస్తున్నారు.
ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి అంటూ తమదైన రీతిలో పెట్టిన వ్యంగ్య పోస్టులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
“త్వరగా ఎన్నికలు పెట్టండయ్యా. లేదంటే ఆ ఉన్న సీట్లు కూడా పోతాయి. 24 అసెంబ్లీ సీట్ల నుంచి 21కి, 3 లోక్సభ స్థానాల నుంచి 2కు పడిపోయాయి. కాలం గడిచే కొద్ది 21 కాస్త 15…10..5 కూడా కావచ్చు. ఆ రెండు లోక్సభ సీట్లు “దేశం” ప్రయోజనాల రీత్యా అసలే లేకుండా పోవచ్చు”
“దండాలయ్యా , ఎన్నికల అధికారులకు శత కోటి దండాలయ్యా…మా సీట్ల భవితవ్యం మీ చేతల్లో వుంది. ఆలస్యమైతే కేటాయించిన సీట్లను కూడా మిత్రపక్షాలు ఎత్తుకెళ్లే ప్రమాదం వుంది. జనసేన సీట్లు…అంతా మీ దయా …ప్రాప్తం” అంటూ జనసేనపై సొంత పార్టీ యాక్టివిస్టులే సెటైర్స్ విసరడం విశేషం. దీన్ని బట్టి జనసేనపై ఎంత అసంతృప్తి వున్నదో అర్థం చేసుకోవచ్చు.