బీజేపీకి ఉత్తరాంధ్రాలో కాస్తా కూస్తా బలం ఉన్నది విశాఖ సిటీలో మాత్రమే. ఇక్కడే ఆ పార్టీ లోక్ సభ స్థానాన్ని రెండు సార్లు ఎమ్మెల్యే సీటుని గెలుచుకుంది. అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉండడం నార్త్ ఇండియన్స్ ప్రభావం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వంటివి ఉండడం బీజేపీ ఓటింగ్ కి అడ్వాంటేజ్ గా ఉంటూ వస్తున్నాయి.
విశాఖ సిటీ దాటితే బీజేపీకి చాలా చోట్ల అతి తక్కువ ఓట్లే ఎప్పుడూ దక్కుతున్నాయి. అయితే అలాంటి చోట్ల ఏకంగా ఎంపీ సీట్లకే బీజేపీ ఎగబాకుతోంది అని అంటున్నారు. పొత్తులలో భాగంగా అనకాపల్లి విజయనగరం ఎంపీ సీట్లను బీజేపీకి ఇస్తారని అంటున్నారు.
ఈ సీట్లు బీజేపీకి ఇస్తే కనుక వైసీపీ అభ్యర్ధులు ప్రచారం చేసుకోకుండానే గెలిచే వీలుంటుందని అంటున్నారు. ఈ రెండు ఎంపీ సీట్లూ గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఉన్నాయి. అనకాపల్లి విశాఖకు ఆనుకుని ఉంది. కొంతవరకూ బీజేపీ తెలుసు అనుకున్నా విజయనగరం ఎంపీ సీటు మరీ దారుణం అని అంటున్నారు.
విజయనగరం ఎంపీ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బీజేపీకి 2019 ఎన్నికలలో చూస్తే నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. విజయనగరంలో నోటాకు 1797 ఓట్లు వస్తే బీజేపీకి 1772 ఓట్లు వచ్చాయి. కురుపాంలో చూస్తే నోటాకు 4535 వస్తే, బీజేపీకి 4204 ఓటు వచ్చాయి.
అలాగే పార్వతీపురంలో నోటాకు 3521 ఓట్లు వస్తే బీజేపీకి 986 ఓట్లు వచ్చాయి. బొబ్బిలిలో చూస్తే నోటాకు 3031 ఓట్లు వస్తే బీజేపీకి 3125 ఓట్లు వచ్చాయి. చీపురుపల్లిలో నోటాకు 3353 ఓట్లు వస్తే బీజేపీకి 1055 ఓట్లు వచ్చాయి. గజపతినగరంలో 4638 ఓట్లు నోటాకు వస్తే బీజేపీకి 1271 ఓట్లు వచ్చాయి. నెల్లిమర్లలో నోటాకు 4766 ఓట్లు వస్తే బీజేపీకి 1152 ఓట్లు పడ్డాయి. మొత్తంగా విజయనగరం పార్లమెంట్ లో బీజేపీకి 13 563 ఓట్లు వస్తే నోటా 25 641 ఓట్లతో విజయం సాధించింది.
ఈ పరిస్థితులలో బీజేపీని విజయనగరం ఎంపీ సీటు కేటాయిస్తారు అని వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా తమకు ఆరు ఎంపీ సీట్లు కావాలని చెప్పి విజయనగరం అడుగుతోందని అంటున్నారు. బీజేపీకి ఇక్కడ సీటు ఇస్తే వైసీపీ నేతలు ప్రచారం ఖర్చులు కూడా లేకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చుని గెలుస్తారు అని సెటైర్లు పడుతున్నాయి.