టీడీపీ తమ్ముడు కాంగ్రెస్ లోకి… పశ్చిమలో సైకిల్ కి పంక్చర్లు?

తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నియోజకవర్గంగా ఉన్న విశాఖ పశ్చిమలో సైకిల్ కి పంక్చర్లు పడుతున్నాయి. ఈసారి అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీ చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఇదే సీటు నుంచి…

తెలుగుదేశం పార్టీకి తిరుగులేని నియోజకవర్గంగా ఉన్న విశాఖ పశ్చిమలో సైకిల్ కి పంక్చర్లు పడుతున్నాయి. ఈసారి అక్కడ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గణబాబు పోటీ చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఇదే సీటు నుంచి గెలిచిన గణబాబు ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.

అయితే ఆ సీటుని ఆశించిన బలమైన సామాజిక వర్గానికి చెందిన పాశర్ల ప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారు. మొదట ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్నారు. కానీ పార్టీ జెండా ఉంటే బాగుంటుందని ఆయన కాంగ్రెస్ లో చేరుతున్నారు.

విశాఖ పశ్చిమలో కాపులు అధికంగా ఉన్నారు. వారి ఓట్లు తనకే పడతాయని ధీమాతో ఆయన పోటీలో ఉన్నారు. టీడీపీలో పాతికేళ్లకు పైగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన ఆయనకు గ్రౌండ్ లెవెల్ లో పట్టుంది. ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తే చీల్చేవి టీడీపీ ఓట్లే అని అంటున్నారు.

గణబాబు రెండు సార్లు పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉండడం వల్ల యాంటీ ఇంకెంబెన్సీ ఉందని అంటున్నారు. ఈసారి ఆయనను మార్చాలని టీడీపీలో నేతలు పట్టుబట్టారు. కానీ అది జరగలేదు. ఇపుడు రెబెల్ గా తమ్ముడు మారి అక్కడే పోటీకి దిగాలని చూస్తున్నారు. పోటా పోటీగా పశ్చిమ పోరు సాగనున్న వేళ కాంగ్రెస్ నుంచి పాశర్ల పోటీ చేస్తే అది టీడీపీ విజయానికి దెబ్బ పడేలా చేస్తుంది  అని అంటున్నారు.

ఇప్పటికి రెండు ఎన్నికల్లో ఓడిన వైసీపీ ఈసారి అన్ని రకాలైన జాగ్రత్తలతో పోటీకి దిగుతోంది. విశాఖ డైరీ చైర్మన్ గా ఉన్న ఆడారి ఆనంద్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీలో ఉన్న అసంతృప్తిని సొమ్ము చేసుకోవడానికి ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఈ పరిణామాలతో పశ్చిమ ఫలితం ఆసక్తికరంగా మారబోతోంది అని అంటున్నారు.