అక్కడ చిరంజీవి.. అయినా ఎవరూ తగ్గట్లేదుగా!

ఓ పెద్ద సినిమా వస్తుందంటే దానికి పోటీగా మరో సినిమా రాదు. సంక్రాంతి సీజన్ ను పక్కనపెడితే, మిగతా టైమ్స్ లో పెద్ద సినిమాలకు ఏదీ ఎదురెళ్లదు. కానీ చిరంజీవి సినిమా వస్తుందని తెలిసి…

ఓ పెద్ద సినిమా వస్తుందంటే దానికి పోటీగా మరో సినిమా రాదు. సంక్రాంతి సీజన్ ను పక్కనపెడితే, మిగతా టైమ్స్ లో పెద్ద సినిమాలకు ఏదీ ఎదురెళ్లదు. కానీ చిరంజీవి సినిమా వస్తుందని తెలిసి కూడా మరో 2 సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. పోటీ అని చెప్పలేం కానీ, ఆ చిన్న సినిమాల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.

చిరంజీవి నటించిన ఆచార్య సినిమాకు ఒక రోజు ముందు ఓ సినిమా, ఒక రోజు ఆలస్యంగా మరో సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి. అలా అని అవి మరీ చిన్న సినిమాలేం కావు. 

ఆచార్య సినిమా ఏప్రిల్ 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాకు ఒక రోజు ముందు కేఈర్కే అనే డబ్బింగ్ సినిమా వస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ సినిమాలో నయనతార, సమంత లాంటి స్టార్ హీరోయిన్లు ఉన్నారు. ఈ త్రికోణం ప్రేమకథపై కోలీవుడ్ లో ఓ మోస్తరు అంచనాలున్నాయి. టాలీవుడ్ లో పెద్దగా అంచనాల్లేవ్.

ఇక ఆచార్య రిలీజైన మరుసటి రోజు శ్రీవిష్ణు సినిమా వస్తోంది. వారాహి బ్యానర్ పై శ్రీవిష్ణు చేసిన భళా తందనాన చిత్రాన్ని ఏప్రిల్ 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. అప్పటికే చిరంజీవి సినిమా మ్యాగ్జిమమ్ థియేటర్లను ఆక్రమించి ఉంటుంది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2కు మరికొన్ని థియేటర్లు ఉంటాయి. ఈ టైట్ పొజిషన్ లో కూడా.. మిగిలిన కొద్దిపాటి థియేటర్లలో శ్రీవిష్ణు సినిమాను విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

ఇదే విషయంపై మేకర్స్ ను అడిగితే, వాళ్లు చిరంజీవి సినిమాతో పోటీ గురించి ఆలోచించడం లేదంట. మే 3న రంజాన్ ఉంది కాబట్టి, ఆ పండగ తమ సినిమాకు కలిసొస్తుందని, ఆచార్యతో పాటు భళా తందనానకు కూడా వసూళ్లు వస్తాయని వాళ్లు చెబుతున్నారు.

మేకర్స్ లాజిక్ పక్కనపెడితే.. ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న సినిమాలకు మరో దారిలేదు. పెద్ద సినిమాలన్నీ ఆగస్ట్ చివరి వరకు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని కూర్చున్నాయి. కాబట్టి వాటితో పాటు చిన్న సినిమాల్ని రిలీజ్ చేయాల్సిందే. 

అందుకే ఆర్ఆర్ఆర్, ఆచార్య, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలొస్తున్నప్పటికీ.. వాటితో పాటు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలతో పాటు.. ఆచార్య రిలీజైన వారానికే అశోకవనంలో అర్జున కల్యాణం. జయమ్మ పంచాయితీ లాంటి సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి.