ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద మనసు చూపారని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలి పరామర్శ తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. అత్యాచార బాధితురాలితో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతుండగా, చంద్రబాబు వెళ్లడంతో గందరగోళం నెలకుంది.
చంద్రబాబు కనీస మర్యాద పాటించకుండా తనతో దురుసుగా ప్రవర్తించారని వాసిరెడ్డి పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను ఎలా పరామర్శించాలో కూడా చంద్రబాబుకు తెలియదనే సంగతి తనకు తెలిసొచ్చిందన్నారు.
తనతోనూ, అలాగే బాధితురాలి పరామర్శకు వందలాది మందితో వచ్చి రౌడీయిజాన్ని ప్రదర్శించిన కారణంగా చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న విచారణ నిమిత్తం మహిళా కమిషన్ కార్యాలయానికి రావాలని ఆ నోటీసులో ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి పద్మ పరిధులు దాటి వ్యహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, బొండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదన్నారు. ఒకవేళ తనకు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని వర్ల రామయ్య ఉచిత సలహా ఇచ్చారు. ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారని మాజీ పోలీస్ అధికారి అయిన వర్ల రామయ్య చెప్పడం గమనార్హం.
ఆ పని చేయకుండా ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, చివరికి కూడా వాసిరెడ్డి పద్మనే జరిపి శిక్ష వేయటం న్యాయ సమ్మతం కాదని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. బాధితులను పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి శాంతి భద్రతలకు వాసిరెడ్డి పద్మ విఘాతం కలిగించారని ఆరోపించారు.
కేవలం పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే పరామర్శ పేరుతో వెళ్లారని అన్నారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను కొట్టేందుకు చెయ్యెత్తారన్నారు. తప్పంతా వాసిరెడ్డి పద్మదే అని, ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారని వర్ల రామయ్య సెలవిచ్చారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.