అయ్యో పాపం ప‌వ‌న్‌… అమాయ‌కుడిని చేసి!

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మొద‌టిసారి సానుభూతి వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ అమాయ‌కుడని, అందుకే సీట్ల‌లో కోత విధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌పై ఎప్పుడూ విరుచుకుప‌డే అమ‌ర్నాథ్‌, తాజాగా…

జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ మొద‌టిసారి సానుభూతి వ్య‌క్తం చేశారు. ప‌వ‌న్ అమాయ‌కుడని, అందుకే సీట్ల‌లో కోత విధించార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్‌పై ఎప్పుడూ విరుచుకుప‌డే అమ‌ర్నాథ్‌, తాజాగా కాసింత సానుభూతి కామెంట్స్ చేయ‌డం విశేషం.

గుడివాడ అమ‌ర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ సీట్ల విష‌యంలో ప‌వ‌న్‌ను అమాయ‌కుడిని చేసి అన్యాయం చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబు మాత్రం 145 సీట్ల‌లో ఒక సీటు త‌గ్గించుకుని, జ‌న‌సేన‌కు ఇచ్చిన 24 సీట్ల‌లో ఏకంగా మూడు సీట్ల‌కు కోత పెట్టార‌ని గుడివాడ అమ‌ర్నాథ్ అన్నారు. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు ఏం స‌మాధానం చెబుతారో చూడాల‌న్నారు. క‌నీసం త‌న అన్న నాగ‌బాబుకు కూడా సీటు ఇప్పించుకోలేక‌పోయాడ‌ని సానుభూతి వ్య‌క్తం చేశారు.

అభివృద్ధి చూసి ఓటు వేయాల‌ని త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ అడుగుతున్నార‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తెలిపారు. అయితే కూట‌మి మాత్రం పొత్తులు చూసి ఓట్లు వేయాల‌ని అడుగుతోంద‌ని వెటక‌రించారు. ఎవ‌రికి ఓటు వేయాలో ప్ర‌జ‌లు ఇప్ప‌టికే ఒక నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని ఆయ‌న అన్నారు.

కూట‌మిలోని పార్టీలు ఏం చెప్పి ఓట్లు అడుగుతాయ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. గ‌తంలో 14 ఏళ్లు సీఎంగా ప‌ని చేసి, పేద ప్ర‌జానీకానికి ఏమీ చేయ‌లేద‌ని ఓటు అడుగుతారా అని చంద్ర‌బాబును ప‌రోక్షంగా ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓట్లు అడిగే అర్హ‌త‌, అవ‌కాశం కూట‌మి పార్టీల‌కు లేవ‌ని ఆయ‌న అన్నారు. ఇలాంటి పార్టీలు ఎన్ని వ‌చ్చినా వైఎస్ జ‌గ‌న్‌ను ట‌చ్ కూడా చేయ‌లేవ‌ని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ‌ చేస్తామ‌ని కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ చెప్పింద‌ని, దానిపై చంద్ర‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ ఏం స‌మాధానం చెబుతార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.