వైసీపీపై రాపాక ధిక్కారం!

అదేంటో గానీ ఎంపీలుగా పోటీ చేయ‌మంటే వైసీపీ ఎమ్మెల్యేలు అంత సుముఖంగా లేరు. తిరుప‌తి ఎంపీ సీటు ఇస్తే, ఇంటి త‌లుపు త‌డుతూ వ‌చ్చిన అదృష్టాన్ని స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కాల‌ద‌న్నారు. ఇప్పుడు…

అదేంటో గానీ ఎంపీలుగా పోటీ చేయ‌మంటే వైసీపీ ఎమ్మెల్యేలు అంత సుముఖంగా లేరు. తిరుప‌తి ఎంపీ సీటు ఇస్తే, ఇంటి త‌లుపు త‌డుతూ వ‌చ్చిన అదృష్టాన్ని స‌త్య‌వేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కాల‌ద‌న్నారు. ఇప్పుడు ఆయ‌న ఎక్క‌డున్నారో, ఏం చేస్తున్నారో ఎవ‌రికీ తెలియ‌ని ప‌రిస్థితి. అలాగే క‌ర్నూలు ఎంపీగా పోటీ చేయ‌వ‌య్యా అని ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రామ్‌కు టికెట్ ఇస్తే, ఆయ‌న కూడా వ‌ద్ద‌న్నారు.

ఇటీవ‌ల చంద్ర‌బాబునాయుడు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. అనంత‌పురం జిల్లా గుంత‌క‌ల్లు నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా అమ‌లాపురం ఎంపీ టికెట్ ఇస్తే, వైసీపీతో క‌లిసి న‌డుస్తున్న జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ధిక్కార స్వ‌రం వినిపించారు. త‌న‌కు రాజోలు టికెట్ కావాల‌ని, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పున‌రాలోచ‌న చేయాల‌ని కోర‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇవాళ వైసీపీ ఆవిర్భావ స‌భ‌లో రాపాక సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజోలులో రెండుసార్లు వైసీపీ ఓడిపోయింద‌ని ఆయ‌న గుర్తు చేశారు. మూడోసారి కూడా వైసీపీ ఓడిపోవ‌ద్ద‌నుకుంటే త‌న‌కు టికెట్ ఇచ్చే విష‌య‌మై సీఎం పునరాలోచ‌న చేయాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

రాజోలు టికెట్‌ను ఇటీవ‌ల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన గొల్ల‌ప‌ల్లి సూర్యారావుకు ఖ‌రారు చేశారు. సీఎం జ‌గ‌న్ ఏది చెబితే, అది చేస్తాన‌ని ఇంత కాలం రాపాక చెబుతూ వ‌చ్చారు. ఇప్పుడు ఆయ‌న యూట‌ర్న్ తీసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. స‌ర్వేలో ఎవ‌రికి బాగుంటే వారికే టికెట్ ఇవ్వాల‌ని రాపాక డిమాండ్ చేస్తున్నారు. త‌న‌కు ఇంగ్లీష్‌, హిందీ భాష‌లు రావ‌ని, ఎంపీగా ఎన్నికైతే ఏం చేయ‌గ‌ల‌న‌ని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. దీన్ని కొట్టి పారేయ‌లేం. రాపాక విష‌యంలో వైసీపీ అధిష్టానం నిర్ణ‌యం ఎలా వుంటుందో!