దేవున్ని ఎందుకు నమ్ముతారంటే, మనిషిని నమ్మడం కష్టం కాబట్టి. దేవుడైతే మోసం చేయడని గ్యారెంటీ. కానీ దేవుడు కూడా మోసమే. చిన్నప్పుడు పిచ్చి సినిమాలు చూసి, ఏడు కొండల వాడా అని పాట ఎత్తుకుంటే కొండలు దిగి వచ్చి కాపాడుతాడని అనుకునేవాన్ని. తిరుపతిలో చాలా ఏళ్లు ఉన్నాక అర్థమైంది. మనం కొండలు ఎక్కాల్సిందే తప్ప, ఆయన దిగి రాడని. మనం ఎక్కినా కనపడడు. డబ్బులు, సిఫార్సులు భారీగా వుంటే మన వైపు కొద్దిగా చూస్తాడు. లేదంటే మనం చూసేలోగా లాగి పడేస్తారు.
ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయి దేవున్ని లైన్లో పెట్టే వాళ్లు లేరు కానీ, ఒకప్పుడు సినిమాల్లో దేవుడికి భలే డిమాండ్. జగదేకవీరుని కథలో కొడుక్కి కష్టం వచ్చిందని తల్లి పాట పాడగానే పార్వతీదేవి దిగి వచ్చి మరీ కాపాడుకుంది. శివయ్య ఇద్దర్ని చేసుకుంటేనే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. నలుగురిని చేసుకుంటే నలిగిపోతావని చెప్పకుండా, ఇంద్రజ చీర ఎత్తుకు రమ్మని సలహా కూడా ఇస్తుంది.
కేవీరెడ్డి మాయ వల్ల జగదేకవీరుడని మనం హీరోని అనుకున్నాం కానీ, ఆయన ఏ లెక్కన వీరుడవుతాడు? మొదట్లో భూతాలు సాయం చేస్తాయి. శిలగా మారిపోతే పార్వతీదేవి వస్తుంది. తర్వాత పిచ్చిరాజు, వెర్రి మంత్రి సీన్లోకి వస్తారు. క్లైమాక్స్‌లో పెద్ద పాట పాడుతాడు. కష్టాలొస్తే చాలు ఎవరో ఒకరు సిద్ధంగా వుంటే జగత్‌లో ఏకవీరుడు ఎలా అయ్యాడు? సినిమాల్లో అన్ని కాలాల్లో లాజిక్ వుండదు. అడక్కూడదు.
నిండు మనసుల్లో ఆపద మొక్కుల వాడా అని దేవికా సుశీలలా పాడే సరికి ఎన్టీఆర్ లేచి కూచుంటాడు. సిరిసిరిమువ్వలో రా దిగిరా అని చంద్రమోహన్ డప్పు కొడితే జయప్రద పెళ్లి ఆగిపోతుంది. పోలీసుల్ని కూడా దేవుడే పంపుతాడు.
మల్లమ్మ కథలో ఈశా మహేశా అని చిన్న పిల్ల ఏడిస్తే శివయ్య టష్మనే విచిత్ర సౌండ్‌తో వస్తాడు. దేవుడు వచ్చినా, వెళ్లినా పళ్లెం మీద కర్రతో కొట్టే సౌండ్ వస్తుంది.
భక్త తుకారాంలో ఉన్నావా అసలు ఉన్నావా అని నాగేశ్వరరావు చెట్లపుట్టలు, కొండలు తిరుగుతూ పాడితే, రాకపోతే ఇంకో పాట ఎత్తుకుంటాడనే భయంతో దేవుడు వచ్చేస్తాడు.
కొన్ని సినిమాల్లో భక్తులకి పరీక్షలు పెట్టి, వాడి బతుకు నాశనం చేసి ఆఖరులో భక్తా, మెచ్చితిని అంటూ వస్తాడు. బతుకు బస్టాండ్ అయిన తర్వాత దేవుడు బస్సు పంపితే ఎంత? పంపకపోతే ఎంత?
సినిమాలో జరిగేది జీవితంలో జరుగుతుందని చిత్తభ్రమతో ఉన్న నేను, దేవుడు వస్తాడని నమ్మాను. పరీక్షల్లో నా బదులు వచ్చి రాస్తాడని విశ్వసించాను. వేరే వాళ్ల పరీక్షలు కూడా నాతోనే రాయిస్తాడని అనుకోలేదు. నేను చేసిన పొరపాటు ఏమంటే పాట పాడకపోవడం. పాడితే జడుసుకుని ఆపడానికైనా వచ్చేవాడు.
ఎన్నో ఉపద్రవాలు, ఉత్పాతాలు వచ్చినప్పుడు వస్తాడనుకున్నా కానీ, రాలేదు. బహుశా గరుత్మంతుడు సెలవు మీద ఉంటాడు.
బేసిక్‌గా జర్నలిస్టులంటే దేవుడికి ఇష్టం. అందుకే రాడు. కనపడితే మైకులు, కెమెరాలు పెట్టి దేవుడి నోటితోనే దేవుడు లేడని చెప్పిస్తారు. యూట్యూబ్ చానళ్లకు దొరికితే స్వర్గం నుంచి పారిపోయి వచ్చిన దేవుడు అని థంబ్‌నెయిల్ పెడతారు.
అప్పట్లో నారదుడు ఒకడే జర్నలిస్టు, ఇప్పుడు జర్నలిజమే నారదీయం.
జీఆర్ మహర్షి