ఆంధ్ర నాట యాంటీ జగన్ వేవ్‌ను క్రియేట్ చేసేందుకు నానా తంటా పడుతోంది తెలుగుదేశం పునాదుల్లో వున్న సామాజిక వర్గ మీడియా. అలాగే దాని అను ‘కుల’ సోషల్ మీడియా హ్యాండిల్స్. కానీ గ్రౌండ్ రియాల్టీ మాత్రం ఫైట్ అన్న దగ్గరే వుంది.
ఇలాంటి నేపథ్యంలో తెలుగుదేశం అధికారం సాధించాలంటే మాత్రం వేవ్ రావాల్సిందే. టఫ్ ఫైట్ లో కొట్టుకువస్తాము.. కనీసం 140 చోట్ల పోటీ చేస్తే 100 గెల్చుకుంటే సరిపోతుంది అనే ఆశలు ఇప్పుడు పనికిరావు. టఫ్ ఫైట్ లో వైకాపాను కొట్టడం కష్టం. వేవ్ వస్తే తప్ప.
ఎందుకంటే 2014 లో కూడా ఇంత ఫైట్ జరిగింది. అప్పుడు జగన్ వస్తే ఏం చేస్తారు. ఏం చేయరు అన్నది తెలియదు. భాజపా, తేదేపా, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాయి. అలాంటి టైమ్ లో వైకాపా 60 కి పైగా స్ధానాలు వచ్చాయి.
ఇప్పుడు జగన్ కు ప్లస్ వుంది. మైనస్ వుంది. వ్యతిరేక మీడియా ప్రచారం కారణంగా జగన్ ఏదీ చేయలేదు అన్న హడావుడి వుంది. కానీ అదే టైమ్ లో జగన్ వస్తే డబ్బులు ఎలా ఇస్తాడు అన్నది క్లారిటీ వచ్చింది. అది జగన్ కు ప్లస్. చంద్రబాబు వరకు చూసుకుంటే అనుభవం అన్నది ఆనాటి ప్లస్ పాయింట్. ఏమీ చేసింది లేదు అన్నది మైనస్ పాయింట్. ఇప్పటికీ అదే పరిస్థితి వుంది.
అంటే ఒక విధంగా చూసుకుంటే 2014 నాటి పరిస్థితి కన్నా ఇప్పటి పరిస్థితి జగన్ కు బెటర్ అనే చెప్పాలి. ఇలాంటి టైమ్ లో జనసేన-భాజపా కు కలిపి 31 అసెంబ్లీ సీట్లు, 8 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. అంటే దాదాపు అన్నీ కలిపి 80 అసెంబ్లీ సీట్లు అనుకోవాలి.
జనసేనకు ఇవ్వడం తెలుగుదేశం పార్టీ జనాలకు ఇష్టం లేదు. అలాగే దేశం కు ఇచ్చి తమను పక్కన పెట్టడం అన్నది జనసేనకు ఇష్టం లేదు. అంటే ఓటు ట్రాన్స్ ఫార్మేషన్ జరగడం అన్నది కీలకం. 2014 లో కలిసినా ఓటు ట్రాన్స్ ఫార్మేషన్ జరిగింది, లేదు అన్నది అంత క్లారిటీ లేదు.
ఇప్పుడు అదే మాదిరిగా ఓట్ల బదిలీ జరగకపోతే వేవ్ అన్నది రాదు. వేవ్ అన్నది వస్తేనే తెలుగుదేశం పార్టీకి అధికారం సాధ్యం అవుతుంది. ఎందుకంటే సుమారు 80 ఎమ్మెల్యే సీట్లలో నానా గడబిడ వుంటుంది. అందులో సందేహం లేదు. ఈ పరిస్థితి చక్కదిద్దుకోవడం తెలుగుదేశం బాధ్యత. క్యాష్ చేసుకోవడం అన్నది వైకాపా చాకచక్యం. ఈ రెండింటి మధ్య ఏది ఎక్కువ అయితే ఆ పార్టీకి విజయావకాశాలు వుంటాయి.