అరుణ‌మ్మా.. మ‌ళ్లీమ‌ళ్లీ చిత‌క్కొడ‌తార‌మ్మా!

జ‌న‌సేన రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాయ‌పాటి అరుణ‌ను చూస్తే జాలేస్తోంది. స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప‌రిచ‌యం ఉన్న రాష్ట్ర అధికార ప్ర‌తినిధికే ఈ దుస్థితై, ఇక ఆ పార్టీలో సామాన్య మ‌హిళా కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటో…

జ‌న‌సేన రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాయ‌పాటి అరుణ‌ను చూస్తే జాలేస్తోంది. స్వ‌యంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ప‌రిచ‌యం ఉన్న రాష్ట్ర అధికార ప్ర‌తినిధికే ఈ దుస్థితై, ఇక ఆ పార్టీలో సామాన్య మ‌హిళా కార్య‌క‌ర్త‌ల ప‌రిస్థితి ఏంటో ఊహించుకోవ‌చ్చు. ఇంత వ‌ర‌కూ రాయ‌పాటి అరుణ‌పై దాడిని జ‌న‌సేన క‌నీసం ఖండించిన పాపాన పోలేదు. ఎందుకింత బాధ్య‌తా రాహిత్యంగా జ‌న‌సేన పార్టీ వుంద‌ని ఆరా తీస్తే, జ‌న‌సేన ముఖ్య నాయ‌కులు చెప్పిన విష‌యాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

ఇంత‌టితో రాయ‌పాటి అరుణ‌ను సొంత పార్టీ వారు విడిచి పెడ‌తార‌ని అనుకోవ‌డం భ్ర‌మే అని, రానున్న రోజుల్లో ఆమెను మ‌రింత‌గా చిత‌క్కొడ‌తార‌ని సొంత పార్టీ నేత‌లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. రాయ‌పాటి అరుణ‌కు సొంత జిల్లా (ప్రకాశం) జ‌న‌సేన అధ్య‌క్షుడు రియాజ్‌తో తీవ్ర‌స్థాయిలో విభేదాలున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు రియాజ్ అత్యంత స‌న్నిహితుడు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హారాల‌ను కూడా రియాజ్ చూస్తుంటారు.

ఒక మాట‌లో చెప్పాలంటే ప‌వ‌న్‌కు రియాజ్ ఆంత‌రంగికుడు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రియాజ్‌ల‌ను ప‌వ‌న్ దూరం చేసుకోరు. రియాజ్‌ను దూరం పెట్ట‌డం అంటే, త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల్ని బ‌జారుకెక్కించుకోవ‌డ‌మే అని ప‌వ‌న్‌కు బాగా తెలుస‌ని మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో పార్టీ వ్య‌వ‌హారాలు చూసే ముఖ్యులు తెలిపారు. అందుకే రాయ‌పాటి అరుణ‌పై రియాజ్ వ‌ర్గీయులు దాడి చేసినా… జ‌న‌సేన నోరు మెద‌ప‌డం లేద‌ని వారు గుర్తు చేస్తున్నారు.

జ‌న‌సేన నుంచి రాయ‌పాటి అరుణ బ‌య‌టికెళ్లాల్సిందే త‌ప్ప‌, ఆమెపై దాడికి సూత్ర‌ధారి రియాజ్‌ను ఎవ‌రూ ఏమీ చేయ‌లేర‌ని జ‌న‌సేన నాయ‌కులే చెబుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. త‌మ‌ను ఏమీ చేయ‌ర‌నే ధైర్యంతోనే అరుణ‌పై దాడికి పాల్ప‌డ్డార‌ని, ఇప్పుడు అదే నిజ‌మైంద‌ని ఆ పార్టీ నాయ‌కులు అంటున్నారు. ఇప్పుడు రాయ‌పాటి అరుణ‌, రేపు పార్టీలో మ‌రే మ‌హిళ‌పై దాడి జ‌రిగినా ఇదే ర‌క‌మైన స్పంద‌న వుంటుందేమో అని వీర మ‌హిళ‌లు వాపోతున్నారు.

జ‌న‌సేన‌, టీడీపీ ప్ర‌భుత్వంతోనే మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ అంటూ ఇంత కాలం ఉప‌న్యాసాలు చెప్పిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, తాజాగా సొంత పార్టీ అధికార ప్ర‌తినిధిని చిత‌క్కొట్టినా నోరు మెద‌ప‌లేద‌ని, ఈయ‌న్ను ఎలా న‌మ్మాల‌నే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది.