ప్రశ్నించడానికి, మూడో ప్రత్యామ్నాయం కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీ పెట్టానని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. అయితే ఆయన మాటలకు, ఆచరణకు ఏ మాత్రం సంబంధం వుండదని గత పదేళ్లలో జనసేన రాజకీయ ప్రస్థానం చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది.
పదేళ్ల క్రితం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. ఆ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పవన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 2019కి వచ్చే సరికి మళ్లీ పవన్ అదే ఎజెండాతో తనదైన రాజకీయ జిమ్మిక్కు చేశారు. అయితే ప్రజలు పవన్‌కు కర్ర కాల్చి వాత పెట్టారు. 2024కి వచ్చే సరికి అదే అక్కసు.
ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్‌ను సీఎం పీఠంపై నుంచి గద్దె దించాలని పట్టుదలతో ఉన్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే, ఓట్లు చీలి మళ్లీ జగనే సీఎం అవుతారని పవన్ భయపడ్డారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా వుండేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టాలని మొదటి నుంచి కోరుతూ వచ్చారు. చివరికి ఆయన అనుకున్నట్టే జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా అడ్డుకోవడం దేవుడెరుగు… పవన్‌కల్యాణ్ సీట్లలో కోత పడింది.
జనసేన సీట్ల తగ్గుదలే ప్రధాన చర్చనీయాంశమైంది. గత నెలలో చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్ ఉమ్మడి సమావేశం నిర్వహించి .. టీడీపీ, జనసేన ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తాయో ప్రకటించారు. జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు ఇచ్చినట్టు పవన్ సమక్షంలో చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే 94 టీడీపీ అభ్యర్థుల్ని చంద్రబాబు ప్రకటించారు.
బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన వాటిలో ఇస్తామని బాబు అన్నారు. కానీ చెప్పిందొకటి, జరిగింది మరొకటి. బాబు తన మార్క్ వెన్నుపోటును పవన్‌కు సుతిమెత్తగా పొడిచారు. బీజేపీ కోసం తాను ఒక అసెంబ్లీ సీటు తగ్గించుకున్న బాబు, జనసేనకు కేటాయించిన వాటిలో మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ సీట్లలో కోత విధించారు.
బీజేపీతో పొత్తు ఉండాలని పట్టు పట్టిన పవన్‌కు ఈ రకంగా బాబు శిక్ష విధించారని టీడీపీ నేతలు అంటున్నారు. జనసేన సీట్లలో కోత విధించిన చంద్రబాబు తెలివితేటల్ని చూసి టీడీపీ నేతలు మురిసిపోతుంటే, పవన్ అనుచరులు మాత్రం ఏడ్వడం ఒక్కటే తక్కువ.