‘నువ్వు గనుక ఒక కుక్కను చంపదలచుకుంటే.. ముందుగా ‘ఆ కుక్క పిచ్చిది’ అనే ముద్ర వేయి!’ అనేది ఒక ఇంగ్లిషు నానుడి. మనం ఎవరినైనా శత్రువుగా పరిగణించి.. వారిని సర్వనాశనం చేసేయాలని అనుకుంటే.. ముందుగా వారిమీద ప్రజలు నమ్మగలిగేలా నిందలు వేయాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాంటి థియరీని ఫాలో అవుతున్నారా? అని సందేహం కలుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీలు భారాస, భాజపాల నుంచి ఎమ్మెల్యేలను ఫిరాయింపజేసి తమ పార్టీలో కలిపేసుకోవడానికి ముందస్తుగా ఒక సుదూర ప్రణాళికతో వ్యూహరచన చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది.
తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఆయన ప్రత్యర్థులు ఒకటే పాట పాడుతున్నారు. త్వరలోనే రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారుతుంది అని అంటున్నారు. నెలలోగా అని, రెండు నెలల్లోగా, మూడు నెలల్లోగా అని, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల తర్వాత అని.. రకరకాలుగా వారు శకునాలు పలుకుతున్నారు. భారాస శకునాలు ఒక ఎత్తయితే.. వారికి తోడు భాజపా కూడా అదే పాట పాడుతూ వస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని అని చెబుతోంది.
రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు అవే మాటలు అంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెసును ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అవేమీ సాధ్యం కావని ఆయన అంటున్నారు. ‘మేం గేట్లు తెరిస్తే భారాసలో కేసీఆర్ కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ఉండరు’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ మాటలను, దూకుడును గమనిస్తే ఒక అనుమానం కలుగుతోంది.
ఇప్పటి దాకా తెలంగాణలో కాంగ్రెసు పార్టీ భారాస ఎమ్మెల్యేల ఫిరాయింపుల జోలికి వెళ్లనేలేదు. కిందిస్థాయిలో మునిసిపాలిటీలను దాదాపుగా భారాస చేతి నుంచి హస్తగతం చేసేసుకుంటూ వచ్చారు. ఒక ఎంపీని కూడా తమలో కలుపుకున్నారు. అయితే ఎమ్మెల్యేల వరకు ఇంకా రాలేదు. అనేకమంది ఎమ్మెల్యేలు వెళ్లి రేవంత్ ను కలుస్తూండగా, వారు ఫిరాయిస్తారనే పుకార్లు వస్తున్నా ఆ జోలికి వెళ్లలేదు.
ఇప్పుడిలా పదేపదే ‘మా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కుట్రలు చేస్తున్నారు’ అనడం గమనిస్తే ఆయన వ్యూహం వేరేగా ఉందా అని అనుమానం పుడుతోంది. వారు మా ప్రభుత్వాన్ని కూల్చేస్తారట అని పదేపదే అంటూ.. ప్రజలను పూర్తిగా నమ్మించిన తర్వాత.. ఆ తర్వాత గేట్లు ఎత్తేసి ఆ పార్టీని ఖాళీ చేసేస్తే ప్రజలందరూ కూడా.. ఫిరాయింపులను ఈసడించుకునే, విమర్శించే పరిస్థితి లేకుండా.. రేవంత్ రెడ్డి అనివార్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశారనే వాతావరణం కల్పించాలని అనుకుంటున్నారేమో అనిపిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ.. నా ప్రభుత్వాన్ని కూల్చేస్తారట అని ఆయన చేస్తున్న ప్రచారం చూస్తుంటే ఈ డౌట్లు పుడుతున్నాయి.