Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాతియుగం బుర్రలు: లైవ్ లో గ్రాఫిక్సా?

రాతియుగం బుర్రలు: లైవ్ లో గ్రాఫిక్సా?

చరిత్రలో రాతియుగం, లోహయుగం, మధ్యయుగం, నవీనయుగం లాంటి పదాలు వినే ఉంటాం. జర్నలిజంలోనూ.. దానితో పాటు నడిచే రాజకీయంలోనూ.. కూడా "రాత"యుగం, శ్రవణయుగం, దృశ్యశ్రవణయుగం, అంతర్జాలయుగం, కృత్రిమమేథ యుగం అనే దశలున్నాయని చెప్పుకోవాలి. 

రాతయుగంలో కేవలం వార్తలు రాత రూపంలోనే ఉండేవి. నేడు జరిగిన వార్తను రేపు పేపర్లో చదువుకోవాలంతే. ఏది రాస్తే అదే నిజం. క్రాస్ చెకింగులకి ఆస్కారం లేదు. 

తర్వాత శ్రవణయుగం..అంటే రేడియోలు. ఏది వినిపిస్తే అదే నిజం. 

ఆ తర్వాత ప్రభుత్వాధీనంలో ఉన్న దూరదర్శన్.. అది దృశ్యశ్రవణ యుగం. అదీ అంతే.. ఎంత చెబితే అంత. ఇదే యుగంలో ప్రైవేటు పరమైన దృశ్యశ్రవణ మాధ్యమాలొచ్చాయి. వీటిని రాజకీయ పార్టీలు వాడుకోవడం మొదలుపెట్టాయి. తిమ్మిని బమ్మి చేయడం, చేతకానివాడిని చాణక్యుడిగా చూపించుకోవడం, ఎవరో ఒక ముఖ్యమంత్రి హైటెక్ సిటీని మొదలుపెడితే దానిని చంద్రబాబు ఎకౌంట్లో వేసుకోవడం.. ఇవన్నీ మొదలయింది ఇక్కడే.

వీటికి తోడు పైనున్న రాతయుగం నాటి పేపర్లు కూడా కంటిన్యూ అవుతూ వచ్చాయి. వాటిని కూడా పూర్తిగా వాడుకున్నది రాజకీయ పార్టీలే. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పార్టీ అండ ఉంటేనే ప్రింట్ మీడియాలో పేపర్ మనుగడ అనేంతగా వాడుకోబడ్డాయి.. బడుతున్నాయి. 

కానీ క్రమంగా ఈ మీడియా అనేది ప్రజల చేతుల్లోకి వచ్చేసింది... అదే అంతర్జాల యుగం. యూట్యూబులో చానలున్న ప్రతి ఒక్కరూ మీడియానే. సొషల్ మీడియాలో ఎకౌంటున్న ప్రతి వ్యక్తి ఒక చానలే. ఎవరు దేన్నైనా రికార్డ్ చేస్తారు. దేని గురించైనా చెబుతారు. దాంతో పైనున్న యుగాల్లోని వార్తాస్రవంతుల ఆటలు ఈజీగా సాగవు. ఏ అబద్ధం చెప్పినా ఈ సోషల్ మీడియా నిజం నిగ్గు తేలుస్తుంది. 

కానీ అదేంటోగానీ చంద్రబాబు నాయుడు ఇంకా ఈ డిజిటల్ యుగం శక్తిని నమ్మక తనకు తెలిసిన గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకుంటూ ఇంకా రాతియుగంలోనే ఉండిపోయాడనిపిస్తుంది. హైటెక్ సీయం గా పేరు పెట్టుకున్న తాను మారుతున్న కాలానికి తగ్గట్టుగా పద్ధతిని మార్చుకోలేకపోతున్నాడు. 

జరిగిన వార్తని కావాల్సిన విధంగా మార్ఫింగ్ చేసి "ఇదిగో అసలు నిజం" అంటూ జనాన్ని ఏమార్చాలనే తెగింపుని చూస్తే నవ్వొస్తుంది. ఈ విషయంలో ఉదాహరణలు చాలానే ఉన్నా తాజాగా జరిగిన "సిద్ధం" మీటింగ్ తాలూకూ మార్ఫింగ్ ప్రచారాన్ని గురించి చెప్పుకుందాం. 

నారా లోకేష్, కొందరు తెదేపా నాయకులు "సిద్ధం" మీటింగ్ కి సంబంధించిన కొన్ని ఫొటోల్ని సోషల్ మీడియాలో పెట్టి, ఎక్కడెక్కడ లేని జనాన్ని ఉన్నట్టుగా కాపీ-పేస్ట్ చేసారో వివరించారు. వాళ్ల పాయింట్ ఏంటంటే "సిద్ధం" కి అసలు జనమే లేరని, కానీ గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని ఉన్నట్టు చూపించారని. 

ఈ సబ్జెక్ట్ గురించి అస్సలు తెలియని అమాయకుల సంగతేమో కానీ, బుర్రన్న ఎవ్వడికైనా అర్థమవుతుంది..ప్రత్యక్ష ప్రసారంలో గ్రాఫిక్స్ సాధ్యమవ్వవు కదా అని. దానికి కూడా పచ్చ చానల్స్ వారు జవాబులు చెబుతున్నారు. లైవ్ టెలీకాస్ట్ పావుగంట ఆలశ్యంగా జరిగిందట..ఆ గ్యాపులో గ్రాఫిక్స్ యాడ్ చేసి లేని జనాన్ని చూపిస్తున్నారట. ఇక ఇది నమ్మే వాళ్లని ఆ దేవుడే కాపాడాలి. 

సరే..కాసేపు నమ్మేద్దాం. మరైతే ఫోటోల్లో చూపించనట్టు వీడియోల్లో మార్ఫింగులెక్కడ జరిగాయో చూపంచరేం? "ఇదిగో..ఇక్కడ ..మళ్లీ ఇక్కడ..ఒకే రకంగా మనుషులున్నారు. కనుక ఇలా కట్-కాపీ-పేస్ట్ చేసారు..." అని వీడియోల్లో కూడా చూపించొచ్చు కదా! ఆ పని చేయకుండా ఒక్క ఫోటోలతోనే గొడవెందుకు? 

ఇక్కడ చెప్పేదేంటంటే మార్ఫింగ్ మాట వాస్తవం. అయితే అది కేవలం ఫోటొల్లోనే. ఎవరు చేసారు అనేది రెండో ప్రశ్న. తెదేపా వాళ్లే చేసి వాడుకుంటున్నారనేది ఒక ప్రచారం. 

కానీ లోపాయికారి సమాచారం ప్రకారం తెలిసిందేంటంటే సి.ఎం ఆఫీసులో ఉన్న ఒక వ్యక్తి అత్యుత్సాహంతో ఉన్న ఫోటోని పెద్దది చేసి, కనిపించిన గ్యాపులన్నీ జనంతో నింపేసి.."ఇదిగో మా సిద్ధానికి జనం కిటకిట.." అంటూ బయటికి వదిలాడట. నిజానికి ఈ మార్ఫింగ్ చేయకుండా ఫోటోని యథాతధంగా వదిలినా కూడా ఆ "కిట కిట" కనపడేది. కానీ అత్యుత్సాహం చేసిన పిచ్చపని ఇది. 

ఇక ఆ ఫొటోలు కాస్తా బయటికి రాగానే తెదేపా వాళ్లు ఆడుకోకుండా, వాడుకోకుండా ఉంటారా? వాళ్లకి వీడియోల్లో ఉన్న లక్షలాది మంది జనం నిజమని తెలిసినా, ఈ ఫోటోలో ఉన్న అసత్యాన్నే ప్రచారం చేసారు. అదీ జరిగింది. 

ఏది ఏమైనా మారుతున్న కాలాన్ని బట్టి బుద్ధిని మార్చుకోవాలి..అది తెదేపా అయినా, వైకాపా అయినా.. మరే పార్టీ అయినా! అత్యుత్సాహంతో అబద్ధాన్ని జనం మీద రుద్దక్కర్లేదు. ఉన్న నిజాన్ని దాటేసి అబద్ధాన్ని నిజమని ప్రచారమూ చెయక్కర్లేదు. 

ఈ డిజిటల్ యుగంలో ఏదీ దాగదు. అన్నీ చిటికెలో బయటికొస్తాయి. ఆ సత్యం గ్రహించి నడుచుకుంటే సరే. లేకపోతే ట్రోలింగులు తప్పవు. 

- శ్రీనివాసమూర్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?