బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ సీటు ఖరారు అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆయన విశాఖకు మంగళవారం వస్తున్నారు. పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం రమేష్ హఠాత్తుగా విశాఖ రావడం మీడియాను అడ్రస్ చేయాలనుకోవడం బట్టి చూస్తే ఆయన పేరు లిస్ట్ లో ఫైనల్ అయింది అని భావిస్తున్నారు. పొత్తులలో భాగంగా అనకాపల్లి ఎంపీ సీటుని బీజేపీకి కేటాయిస్తున్నారు.
ఈ సీటు కోసం సీఎం రమేష్ ఢిల్లీ స్థాయి నుంచే ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు అని అంటున్నారు. టీడీపీతో సీట్ల సర్దుబాటు మీద చర్చించేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బాబు నివాసానికి వచ్చినపుడు ఉండవల్లి బాబుతో చర్చలు జరిపారు.
దాంతో అక్కడ కూడా సీఎం రమేష్ ఉంటూ తన సీటు ఖరారు చేయించుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు అని అంటున్నారు. దాదాపుగా ఏడెనిమిది గంటల పాటు సాగిన బీజేపీ టీడీపీ చర్చలలో అభ్యర్ధుల ఎంపిక సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు.
అందులో అనకాపల్లి నుంచి సీఎం రమేష్ ని పోటీ చేయిస్తున్నారు అని అంటున్నారు. ఈ సీటు విషయంలో మరో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకి సీఎం రమేష్ కి మధ్యనే పోటీ నడచిందని చివరికి సీఎం రమేష్ కే టికెట్ ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయించారని అంటున్నారు.
ఇదంతా ప్రచారంలో ఉన్న మాట. సీఎం రమేష్ విశాఖకు రావడం లోకల్ మీడియాను కలవాలనుకోవడంతో ఆయనకు టికెట్ ఇచ్చేస్తున్నారు అని అంతా అనుకుంటున్నారు. మీడియాతో సీఎం రమేష్ ఏమి మాట్లాడుతారు అన్నది ఇపుడు ఆసక్తిని రేపుతోంది.