మంత్రి పదవి దక్కకపోవడంపై భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మనసులో మాట బయట పెట్టారు. ఈయన జనసేనాని చిరంజీవిపై గెలుపొంది, అందరి దృష్టిని ఆకర్షించారు. అగ్రహీరోతో పాటు జనసేన అధినేతను ఓడించిన నేత కావడంతో మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లెక్కలు వేరుగా ఉన్నాయి. శ్రీనివాస్‌కు మంత్రి పదవి దక్కలేదు.
ఈ నేపథ్యంలో ఆయన ఓ చానల్‌తో మాట్లాడుతూ మంత్రి పదవి దక్కకపోవడం, జగన్‌పై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మంత్రి వర్గ జాబితాలో చివరి వరకూ తన పేరు ఉందన్నారు. అయితే ఫైనల్ లిస్ట్‌లో మాత్రం చోటు దక్కించుకోకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. మంత్రి పదవి ఇచ్చారంటే సీఎంకు ఇష్టమైన వ్యక్తులనే కొలమానంగా గ్రంధి చెప్పారు.
అలాంటిది తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో, జగన్‌కు తానంటే ఇష్టం లేదేమో అనే ఫీలింగ్ కొంచెం బాధ కలిగించిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అసంతృప్తి అనేది లేదన్నారు. మంత్రి పదవి అనేది ముఖ్యమైంది కాదన్నారు. ఎందుకంటే ఎప్పటికైనా మాజీ కావాల్సిందే అన్నారు.
ప్రజల మనసు చూరగొనేదే శాశ్వతమైందన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేయడంలో మంత్రి పదవి రాలేదనేది అడ్డంకి కాదన్నారు. తానెప్పుడూ ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటానే తప్ప, అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేయాలని అనుకోనన్నారు. జగన్ అంటే తనకు చాలా చాలా ఇష్టమని చెప్పారు.
ఎన్నికలకు ముందు అర్జునుడికి కృష్ణుడి గీతోపదేశంలా తనకు జగన్ దిశానిర్దేశం చేశారన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అని డోలాయమాన స్థితిలో ఉన్ననప్పుడు ….గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేయాలని, అప్పుడే రాజకీయాల్లో ఉంటావని జగన్ చెప్పిన మాటలను తానెప్పటికీ మరిచిపోలేనని గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.