రామ్ చరణ్ తో అనుకున్న సినిమా మిస్ అవ్వడం, ఆ తర్వాత కరోనా వల్ల ఆచార్య కోసం తన కెరీర్ లోనే అత్యథిక సమయాన్ని వెచ్చించడం.. ఫలితంగా కొరటాల శివ గట్టిగానే హర్ట్ అయినట్టున్నాడు. దీంతో ఇకపై తను చేసే సినిమాలకు సంబంధించి ఏ హీరో ముందుగా కాల్షీట్లు ఇస్తే, ఆ హీరోతోనే సెట్స్ పైకి వెళ్తానని ఇదివరకే ప్రకటించాడు. ఇప్పుడీ దర్శకుడు అదే మాటను మరోసారి అంటున్నాడు. ఈసారి మొహమాటపడదలుచుకోలేదని స్పష్టంగా చెబుతున్నాడు.
ఆచార్య విడుదలైన తర్వాత ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు కొరటాల శివ. ఆ మూవీ తర్వాత మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తానని చెబుతున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల తర్వాత తామిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై చాలామందికి ఆసక్తి ఉందని, సినిమా కచ్చితంగా ఉంటుందని చెబుతున్నాడు.
మహేష్ మూవీతో పాటు లిస్ట్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు కూడా ఉన్నాయంటున్నాడు. అయితే ఏ సినిమా ముందు వస్తుంది, ఏది తర్వాతొస్తుందనే విషయం తన చేతిలో లేదంటున్నాడు కొరటాల. ఎవరు ముందుగా కాల్షీట్లు ఇస్తే, వాళ్లతోనే సినిమా మొదలుపెడతానని చెప్పుకొచ్చాడు.
భరత్ అనే నేను సినిమా తర్వాత పూర్తిగా మెగా కాంపౌండ్ లోనే ఉండిపోయాడు కొరటాల శివ. ముందుగా చరణ్ తో సినిమా అనుకొని, ఆ తర్వాత చిరంజీవితో ఆచార్య చేశాడు. మధ్యలో 2 దశల కరోనా వల్ల కొరటాల చాలా సమయాన్ని కోల్పోవాల్సి వచ్చింది.